వృద్ధురాలిపై దాడిచేసి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై దాడిచేసి దోపిడీ

Sep 4 2026 1:36 AM | Updated on Sep 4 2026 1:36 AM

ఇంట్లోకి ప్రవేశించి దుండగుడి చర్య

8 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలి ఫిర్యాదు

సి.బెళగల్‌: మండల పరిధిలోని సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడిచేసి ఒంటిపై ఉన్న బంగారు నగలను గుర్తు తెలియని దుండగుడు దోచుకెళ్లిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామంలోని ప్రధాన దారిలో పిరమిడ్‌ కేంద్రం దగ్గరున్న ఇంట్లో వృద్ధురాలు సంజీవమ్మ భర్త మల్లికార్జున శెట్టి 8 నెలల కింద అనారోగ్యంతో మృతి చెందటంతో ఒంటరిగా నివశిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సంజీవమ్మ ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా, అప్పటికే పథకంతో ఉన్న దుండగుడు ఇంట్లోకి చొరబడి, వృద్ధురాలిపై దుప్పటి కప్పి మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసు, చేతికి ఉన్న 3 మూడు తులాల బంగారు గాజులను లాక్కొని వృద్ధురాలిని బాత్రూంలోకి తోసి బయట గడియతోపాటు, ఇంటి గడియ పెట్టి పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ బయటివారికి వినిపించలేదు. తరచూ వృద్ధురాలితో మాట్లాడే అదే ప్రాంతంలోని యువకుడు సాయంత్రం ఇంటి వద్దకు వెళ్లి చూడగా గదిలో తలుపు కొడుతున్న శబ్దం రావడంతో తలుపు తీయగా నీరసంగా బాధిత మహిళ సంజీవమ్మ కనిపించింది. విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో వెంటనే సి.బెళగల్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.

6 రోజుల క్రితమే విఫలయత్నం?

బాధితురాలు జరిగిన సంఘటనను తెలియజేస్తూ.. గత శనివారం (ఆగస్టు 29న) రాత్రి ఇంట్లో పడుకుని ఉండగా బయటి నుంచి తలుపు కొట్టిన శబ్దం వచ్చిందని, తాను భయంతో తలుపు తీయలేదని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఇంటి పరిసరాల్లో సంచిలో వేట కొడవలి, మాస్క్‌, హెల్మెట్‌, గ్లౌజ్‌లు, రెయిన్‌కోట్‌, సాక్సులు కనిపించాయని బాధితురాలు తెలిపింది. రాత్రి వేళ తలుపు కొట్టడంతో పాటు, ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లభించిన విశయాన్ని సంజీవమ్మ బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో, వారి సూచన మేరకు ఇంటికి సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టారు. కాగా ఆరు రోజుల క్రితమే దుండగుడు చోరీకి విఫలయత్నం చేసినట్లు స్థానికులు చర్చించుకున్నారు.

భయాందోళనలో గ్రామస్తులు

ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళను లక్ష్యంగా చేసుకుని బంగారం దోపిడీ చేయడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మారుమూల పల్లెటూరు అయిన సంగాల గ్రామంలో దుండగుడు ఆయుధాలు, రక్షణ సామగ్రితో దోపిడీకి పాల్పడటంతో పల్లె ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు సమగ్రంగా విచారించి, నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో పొలీసు నిఘా పెంచాలని కోరుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement