వన్‌స్టాప్‌ సెంటర్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

వన్‌స్టాప్‌ సెంటర్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

ఐసీడీఎస్‌ పీడీ పీ విజయ

కర్నూలు(అర్బన్‌): కర్నూలు, ఆదోనిలోని వన్‌స్టాప్‌ సెంటర్లలో పలు రకాల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ పీ విజయ తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. కర్నూలు, ఆదోనిలో నివాసం ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి నోటిఫికేషన్‌, ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయం, www. kurnool.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. కర్నూలులో కేసు వర్కర్‌ (ఎస్సీగ్రూపు– 2 మహిళలకు), ఆదోనిలో కేసు వర్కర్‌ (ఎస్టీ మహిళ), పారా మెడికల్‌ సర్సనల్‌ (ఎస్టీ మహిళ), సైకో సోషియల్‌ కౌన్సిలర్‌ (ఓసీ మహిళలకు) పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 1 నుంచి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

క్వింటా ఉల్లి రూ.3,898

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆగస్టు నెల 24న ఉల్లిగడ్డలకు గరిష్టంగా క్వింటాకు రూ.4,329 ధర లభించింది. మరుసటి రోజు నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 29న గరిష్ట ధర రూ.3,629 లభించింది. తాజాగా సోమవారం కర్నూలు మార్కెట్‌కు 1,796 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.2,079 ఉండగా.. గరిష్ట ధర రూ.3,989 లభించగా.. సగటు ధర రూ.3,614 నమోదైంది. వేరుశనగ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కర్నూలు మార్కెట్‌కు 227 క్వింటాళ్ల వేరుశనగ బుడ్డలు రాగా కనిష్ట ధర రూ.4,600, గరిష్ట ధర రూ.9,299 లభించగా.. సగటు ధర రూ.7,411మాత్రమే నమోదైంది. ఆదోని మార్కెట్‌కు 827 క్వింటాళ్లు రాగా కనిష్ట ధర రూ.3,509, గరిష్ట ధర రూ.8,910 లభించగా.. సగటు ధర రూ.7,439 పలికింది. మార్కెట్‌లో మొక్కజొన్నలకు కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నాయి. క్వింటాకు రూ.2,360 ధర లభించింది.

నేడు పింఛన్ల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. పింఛన్ల పంపిణీకి కర్నూలు జిల్లాకు రూ.102.48 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.90.87 కోట్లు సోమవారం బ్యాంకులకు విడుదల అయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు డ్రా చేశారు. 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేస్తారు. కర్నూలు జిల్లాలో 2,33,431, నంద్యాల 2,09,732 ఉన్నాయి. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ అంటున్నా... కేవలం నామమాత్రానికే పరిమతమైంది. కొత్త పింఛన్లు ఇదుగో, అదుగో అంటున్నా.. అతీగతీ లేకపోవడంపై అవ్వాతాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అనే చంద్రబాబు హామీ గాలిలో కలసి పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement