● ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్‌కు నోటీసు అందజేత
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలైనా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉద్యమ భేరి మోగించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. వందలాది మంది ఉద్యోగులతో వెళ్లిన ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్‌రెడ్డి, కార్యదర్శి ఎం.వెంకటరాజు మాట్లాడుతూ 29 డిమాండ్లతో నోటీసును అందజేసి ఉద్యమానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాలని కోరితే ఉద్యోగ సంఘాల నాయకులపై రాజకీయ ముద్రలు వేసి ఏజెంట్లని సంబోధించడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మురళీకృష్ణనాయుడు, శంకరప్ప, రంగారెడ్డి, పీఆర్ ఉద్యోగుల నుంచి జ్యోత్స్న, ధనిబాబు, ఆర్‌టీసీ నుంచి మహేష్, సాలమ్మ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, టీచర్స్ నుంచి ఎస్‌ఎల్‌టీఏ నాయకులు మద్దిలేటి, వెంకటేష్ పాల్గొన్నారు.


