తుంగభద్ర కాలువలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా మూడవ సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. మూడవ సోమవారం సుమారు 3 నుంచి 4లక్షల మంది భక్తుల తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారని అంచనా. రద్దీ దృష్ట్యా భక్తులు ఆదివారం ఉదయం నుంచే తరలిరావడంతో క్షేత్రం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దిగువ కాల్వలో స్నానాలు ఆచరించి, స్వామి సన్నిధిలో పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తులు తరలివస్తుండటంతో రాత్రంతా దర్శనాలు కొనసాగుతాయని, అర్ధరాత్రి 12 గంటల అనంతరం పూజల కోసం అర గంట పాటు దర్శనాలు నిలుపుతామని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కౌతాళం సీఐ యుగంధర్‌తో పాటు మరో నలుగురు సీఐలు ఎస్‌ఐలు, పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


