కర్నూలు(అర్బన్): ‘తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. వేసిన అరకొర పంటలు కూడా తొంభై శాతం దెబ్బతిన్నాయి. చాలా మంది పంటలను దున్నేస్తున్నారు. ఖరీఫ్ కలిసిరాక తీవ్రంగా నష్టపోయిన రైతులను పాడి రూపంలో ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంద’ని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పాడి పరంగా రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పశు సంపదను పెంచుకునేందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందించాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలన్నారు. ప్రస్తుతం 125 పనిదినాలు ఉన్నాయని, రోజుకు 25 వేల మంది కూలీల హాజరవుతున్నారని, వ్యవసాయ పనుల్లేక పోవడం దీనికి కారణమని డ్వామా అదనపు పీడీ మాధవీలత చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని రైతు లు, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు అవసరమైన పనులను మరింత పెంచాలని కోరారు.
ఖరీఫ్‌నకు నీరివ్వకపోవడం దురదృష్టకరం
పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలకు నీరు పుష్కలంగా వచ్చి చేరినా, ఖరీఫ్‌కు నీరు ఇవ్వలేమని చెప్పడం దురదృష్టరమని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీటిని విడుదల చేసినా, నేటికి జిల్లాలోని చెరువులను నింపుకోకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హంద్రీనీవా నీటిని కేవలం తాగునీటి అవసరాలకు ఉపయోగించాలకున్నప్పుడు 77 చెరువులను నింపితే భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది కదా? అని ఆయన అధికారులను ప్రశ్నించారు. కోడుమూరు, డోన్, పత్తికొండ ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలకు గాజులదిన్నె నీటిని వినియోగించాల్సి ఉన్నప్పుడు జీడీపీకి ఎందుకు హంద్రీనీవా నీటితో నింపడం లేదన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలను ఎండగట్టి ఎవరి ప్రయోజనాల కోసం వెలిగొండకు నీటిని తీసుకుపోతున్నారని పాపిరెడ్డి ప్రశ్నించారు. కోడుమూరు, వెల్దుర్తి, కాల్వ హుసేనాపురం, గడివేముల, వెలుగోడు వరకు రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సమావేశాల్లో జెడ్పీసీ ఈఓ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు మహేశ్వరరెడ్డి, సీహెచ్ మనోహర్, సాంఘిక సంక్షేమ శాఖ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు బి. రాధిక, ఎంవీ శివారెడ్డి, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ జిల్లా అధికా రి టీవీ భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు.
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో
ఎవరేంమాట్లాడరంటే..
● ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామ రోడ్డుకు ఇరువైపులా బంక మట్టి వేయడంతో చాలా ఇబ్బందిగా ఉంది.
– శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ ఆత్మకూరు
● కోడుమూరు – వెల్దుర్తి రోడ్డు పనులను ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏడాదిన్నరగా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి.
– బి రఘునాథరెడ్డి, జెడ్పీటీసీ, కోడుమూరు
● 50 సంవత్సరాల పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
– డి.సుంకన్న, జెడ్పీటీసీ, వెల్దుర్తి
● శిథిలావస్థకు చేరిన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు 20 శాతం దాతలు చెల్లిస్తే, 80 శాతం నిధులు ప్రభుత్వం సమకూరుస్తుందనే అంశంపై అవగాహన కల్పించాలి.
– జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
పంటల రూపంలో నష్టపోయిన
రైతులకు పాడి ద్వారా
ఊరట కలిగిద్దాం
టీబీ డ్యాం, శ్రీశైలంలో ఇన్‌ఫ్లో ఉన్నా
ఖరీఫ్‌నకు నీరివ్వకపోవడం
దురదృష్టకరం
వెలిగొండలో నీరు నింపేందుకు
రెండు జిల్లాలను ఎండగడుతున్నారు


