కర్నూలు: హైకోర్టు బెంచ్ సాధనే లక్ష్యంగా ఉద్యమం మరింత ఉధృతం చేయనున్నట్లు న్యాయవాదులు ప్రకటించారు. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు నేతృత్వంలో విధుల బహిష్కరణతో పాటు రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఈ దీక్షలో మామిళ్ల విక్టర్, కృష్ణప్రసాద్, శ్రీనివాసులు గౌడ్, ఎ.శ్రీనివాసులు, రాము, ఎండీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆరు రోజులుగా నిరాహారదీక్షలు కొనసాగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని ప్రకటించారు. జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, సీనియర్ న్యాయవాదులు రామ సుబ్బారెడ్డి, నాగేంద్రనాథ్, కె.ఓంకార్, వై.జయరాజ్, వి.నాగలక్ష్మి దేవి, ఎంఆర్ కృష్ణ, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు ప్రకటించారు.


