కోడుమూరు రూరల్/గూడూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు గూడూరులో శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. గూడూరుకు చెందిన ఎర్రన్న (40) అనే వ్యక్తి స్నేహితుడితో కలిసి వ్యక్తిగత పనిమీద శుక్రవారం బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి వస్తుండగా కర్నూలు నగర శివార్లలోని సెయింట్ క్లారెట్ స్కూల్ వద్ద ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఎర్రన్న మృతికి ట్రాక్టర్ డ్రైవరే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు శనివారం మృతదేహంతో గూడూరు నుంచి ట్రాక్టర్ డ్రైవర్ స్వగ్రామమైన మునగాల వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని నిలువరించడంతో మృతుడి కుటుంబ సభ్యులు నాలుగురోడ్ల కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. ఎమ్మిగనూరు–కర్నూలు రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయా యి. ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప బాధితులతో మాట్లాడినప్పటికీ వారు ససేమిరా అన్నారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ గూడూరు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి మృతదేహాన్ని తీసు కుని వెళ్లిపోయారు. కాగా గంటకుపైగా మృతుడి కుటుంబ సభ్యులు నాలుగు రోడ్ల కూడలిలో ఆందోళన చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.


