కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పటు సాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో నా పట్టు– నా అభిమానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి విజయకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టుసాగుకు ఇస్తున్న రాయితీలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ...ఇప్పటి వరకు వెల్దుర్తి, ఆదోని, పత్తికొండ, కల్లూరు, గూడూరు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, మిగిలిన మండలాల్లో కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పట్టుపురుగుల పెంపకానికి ఇది వరకు భారీ ఖర్చుతో షెడ్లు నిర్మించుకోవాల్సి ఉందని, ప్రస్తుతం తక్కువ ఖర్చులతో పట్టు పురుగుల పెంపకానికి సెంట్రల్ సిల్క్ బోర్డు గుడిసెలు నిర్మించుకునేందుకు రూ.2.25 లక్షలు రాయితీ ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది 12 గుడిసెలు మంజారయ్యాయని వివరించారు.
కారు బోల్తా.. ప్రొద్దుటూరు వాసి దుర్మరణం
ఓర్వకల్లు: మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా, జాతీయ రహదారిపై వెళుతున్న కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇద్రుష్‌బాష(56), తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి శనివారం కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో నన్నూరు సమీపాన కుమారుడు షంషీర్‌ఖాజా కారు నడుపుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్రుష్‌బాష తలకు బలమైన రక్తగాయం కావడంతో హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బొమ్మలసత్రం: నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. తాలూకా సీఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకు.. చాబోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, కుమారి (38) దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీనివాసులు పాలిష్ కటింగ్ కార్మికునిగా, కుమారి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఉదయం మహానంది మండలం నందిపల్లె గ్రామంలో వ్యవసాయ పనులు చేసేందుకు భార్యాభర్తలు స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యలో అయ్యలూరు మెట్ట వద్ద టిప్పర్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న కుమారి రోడ్డుపై పడిపోవడంతో టిప్పర్ టైర్లు ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్ ఢీకొనియువకుడి దుర్మరణం
చాగలమర్రి: పెద్ద బోధనం సమీపంలోని పాత వంతెన వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. చిన్నబోధనం గ్రామానికి చెందిన ప్రశాంత్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్తుండటంతో అతని మిత్రులు అదే గ్రామానికి చెందిన మీసా సంపత్ కుమార్ (23), అన్నవరం శివ బైక్‌పై వెళ్లి ఆళ్లగడ్డలో బస్సు ఎక్కించారు. అనంతరం ఇద్దరు తిరిగి వస్తుండగా పెద్ద బోధనం సమీపంలో ఉన్న సర్వీసు రోడ్డు వద్ద శివ మూత్ర విసర్జనకు వెళ్లగా, సంపత్ కుమార్ బైక్ వద్ద ఉన్నాడు. అదే సమయంలో చింతకొమ్మదిన్నె వైపు నుంచి మైల ఓబు లేసు, నాగేంద్ర బైక్‌పై వస్తూ సంపత్ కుమార్‌ను ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన సంపత్‌కుమార్‌ను స్థానికులు టోల్‌ప్లాజా అంబులెన్సులో ఆళ్లగడ్డకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు చాగలమర్రి ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుడి తండ్రి మత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసు విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.


