● మహిళ బ్యాగ్‌లో నుంచి
35 తులాల బంగారు ఆభరణాలు చోరీ
మంత్రాలయం: ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం మంత్రాలయంలో భారీ చోరీ జరిగింది. రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుండగా ఓ వైపు దొంగలు రెచ్చిపోతున్నారు. శనివారం రాఘవేంద్రుడి ఉత్సవాల నిమిత్తం విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఇంజినీర్ దివాకర్ భార్య కవిత బ్యాగ్‌లో ఉన్న 35 తులాల బంగారిన్ని ఆపహరించారు. స్థానిక అన్నపూర్ణ భోజనశాల నుంచి శ్రీనికేతన్ లాడ్జి షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపింగ్ చేస్తుండగా ఈ చోరీ చోటు చేసుకుంది. ఆదోనిలో బంధువుల పెళ్లి నిమిత్తం బాధితురాలు ఆభరణాలు తన వెంట తెచ్చుకున్నారు. నగల విలువ దాదాపు రూ. 52.50 లక్షలు ఉంటుంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పోలీసులకు దృష్టికి తీసుకెళ్లినా కేసు నమోదు చేయకపోవడం శోచనీయం. సీసీ కెమెరాల పరిశీలన పేరుతో అర్ధరాత్రి గడిచిన కేసుపై మీనమేషాలు లెక్కిస్తూ వచ్చారు. ఈ విషయం సీఐ దస్తగిరి బాబును వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే కోయంబత్తూర్ చెందిన భక్తులు శ్రీమఠం రూమ్ అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్, రైల్వే టికెట్స్, మనీ పర్స్‌తో పాటు అందులో ఉన్న నగదు రూ.2 వేలు ఆపహరణకు గురయ్యాయి. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శ్రీ మఠంలో సీసీ ఫుటేజీ పరిశీలించారు.


