● బైక్‌ను ఢీకొన్న లారీ..
బావ, బామ్మర్ది దుర్మరణం
● పది నిమిషాల్లో గమ్యస్థానం..
అంతలోనే విషాదం
తుగ్గలి: మరో పది నిమిషాల్లో ఆ ఇద్దరూ ఇంటికి చేరుకునేవారు. ఈలోపు వారిని మృత్యువు మింగేసింది. బైక్‌పై వెళుతున్న బావ, బామ్మర్దిని లారీ రూపంలో కబలించింది. ఈ విషాద ఘటన తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. మద్దికెర మండలం మదనంతపురానికి చెందిన గిరిగెట్ల రంగస్వామి, ఈరమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర (23), హనుమరాజు మల్లికార్జున, రమణమ్మల కుమారుడు బాలరాజు (20) ఇద్దరు వరుసకు బావ, బామ్మర్దులు. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ అనంతపురం జిల్లా గుత్తిలో గుజిరీ దుకాణంలో కూలి పనులకు వెళుతున్నారు. రోజూమాదిరిగానే శుక్రవారం పని ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. రాత్రి 10.50 గంటల సమయంలో మార్గమధ్యలో జొన్నగిరి సమీపంలోని ఎర్రమన్నుగుట్ల మలుపు వద్దకు రాగానే.. తుగ్గలి వైపు నుంచి వేరుశనగ చెక్క లోడుతో గుత్తి వైపు వేగంగా వెళుతున్న లారీ (ఏపీ 39 యూజే 9771) మలుపులో అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరి తలలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే మహేంద్ర మృతి చెందాడు. బాలరాజును మెరుగైన చికిత్స కోసం అనంతపురం కిమ్స్ సవేరా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మహేంద్రకు ఏడాది కిందట వివాహం జరిగింది. బాలరాజుకు వివాహం కాలేదు. ఎంతో ఆసరాగా ఉన్న కుమారుల మృతి ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున శనివారం తెలిపారు.
మృతి చెందిన మహేంద్ర, బాలరాజు (ఫైల్)


