జూపాడుబంగ్లా: గత వారం రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలో చొరబడి విద్యార్థుల రికార్డులు, ఫ్యాన్లను ధ్వంసం చేయడంతో పాటు రేషన్ బియ్యంను చిందరవందర చేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పి.లింగాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వారం రోజుల నుంచి నిత్యం గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి పాఠశాలలోకి చొరబడి హెచ్‌ఎం గదితో పాటు తరగతి గదులను చిందరవందర చేస్తున్నారు. హెచ్‌ఎం గదిలోని బీరువా తలుపులు తెరచి అందులోని రికార్డులను చింపివేశారు. అలాగే విద్యార్థులకు భోజనం వండిపెట్టే బియ్యాన్ని చిందరవందర చేశారు. తరగతి గదుల్లోని ఫ్యాన్ల రెక్కలు విరిచేశారు. ఘటనపై హెచ్‌ఎం రేష్మ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో అల్లరిమూకల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకొని అల్లరిమూకలపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరుతున్నారు.


