● తుంగభద్ర నదిలో మునిగి తల్లీ మృతి,
కుమార్తె గల్లంతు
కౌతాళం: విహార యాత్ర విషాదంగా మారిన సంఘటన మండల పరిధిలోని సుళేకేరి గ్రామంలో చోటుచేసుకుంది. శ్రావణ మాసం కావడంతో చికెన్, మటన్ వ్యాపారులు ఈ నెలంతా వ్యాపారానికి దాదాపుగా సెలవు ప్రకటిస్తారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేపట్టడం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కటిక రసూల్ కుటుంబం, సమీప బంధువులతో కలిసి శుక్రవారం విహార యాత్రకు వెళ్లారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంను సందర్శించి పరిసర ప్రాంతాల్లో కలియతిరిగి రాత్రి హంపికి చేరుకుని బస చేశారు. శనివారం ఉదయం దగ్గర్లోని తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు తల్లి షాహిన్ (38), కూతురు యాస్మిన్ (13) నీటిలోకి దిగారు. కూతురు నీటిలో మునిగిపోతుండగా తల్లి గమనించి కాపాడే ప్రయత్నంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. మిగతా కుటుంబ సభ్యులు నదిలో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం షాహిన్ మృతదేహం లభ్యమైంది. యాస్మిన్ కోసం గాలిస్తున్నారు. షాహిన్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబంలో నీట మునిగి తల్లి మృతి, కూతురు గల్లంతు కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
షాహిన్ , యాస్మిన్ (ఫైల్)


