కర్నూలు కల్చరల్: వరల్డ్ గ్లోబల్ పీస్ అంబాసిడర్‌గా ప్రముఖ సామాజిక సేవకులు, అలై అండ్ లయన్ రాయపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. వివిధ సేవా సంస్థలు, క్లబ్‌ల ద్వారా గత 38 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా ప్రస్థానానికి గుర్తింపుగా నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఇన్ సైట్ పూల్ ఆఫ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ అండ్ ఏజిస్ గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. గ్లోబల్ పీస్ అంబాసిడర్‌గా నియమితులైన రాయపాటికి పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక వేత్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సి.బెళగల్: మండలంలో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు. ఆయన శుక్రవారం సిబ్బందితో మండలంలోని గ్రామాల్లో గస్తీ నిర్వహించారు. నదీ తీర గ్రామమైన తిమ్మందొడ్డి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ నదీ తీర గ్రామాల ప్రజలను కోరారు.
అర్ధరాత్రి హైవేలో చోరీ
● వాహనంలో ఉంచిన నగదును
మాయం చేసిన దుండగులు
పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె వద్ద హైవేలో వాహనంలో ఉంచిన నగదును దుండగులు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామానికి చెందిన కంచర్ల మల్లికార్జున ఏపీ 39 డబ్ల్యూజీ 5175 నంబర్ గల బొలేరో క్యాంపర్‌తో పాటు మరో క్యాంపర్ పత్తి లోడ్‌తో ఆదోని మార్కెట్ యార్డుకు వచ్చారు. పత్తి విక్రయించగా వచ్చిన నగదును వాహనంలో ఉంచుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వాహనానికి స్పేర్ పార్ట్‌ల కోసం కర్నూలు ఆటోనగర్‌కు వెళ్లి పెద్దటేకూరు మీదుగా నన్నూరు వచ్చి హైవే ఎక్కారు. రాత్రి 1.30 గంటల సమయంలో నిద్ర ముంచుకురావడంతో తమ్మరాజుపల్లె ఘాట్ రోడ్డు వద్ద వాహనాన్ని పక్కన నిలిపి నిద్రపోయారు. ఇంతలోనే దొంగలు వాహనంలో ఉన్న రూ.3,69,500 నగదును ఎత్తుకెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూడగా వాహనంలోని డబ్బులు మాయం కావడంతో 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చి విచారణ జరుపుతున్నారు. ఇదిలాఉండగా పత్తి యజమానులు మార్కాపురం నుంచి పాణ్యం పోలీసు స్టేషన్ వచ్చారు. వాహన డ్రైవర్ కంచర్ల మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


