గుబులు రేపుతున్న గుడిసె క్రిష్ణమ్మ లేఖ
కోడుమూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కంటే డీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి పెత్తనం అధికంగా కొనసాగుతోంది. దస్తగిరి పూర్తిగా విష్ణు అదేశాల మేరకే పనిచేస్తున్నారు. విష్టువర్దన్‌రెడ్డి టీడీపీలో ఉన్నా, తన వ్యక్తిగత అజెండాతోనే కొనసాగుతున్నారు. కాగా, ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణు సూచించిన వారికి ఎలాంటి పదవులు రావడం లేదు. ఎంపీ బస్తిపాటి నాగరాజు రెకమెండ్ చేసిన వారికే పదవులు వచ్చాయి. సీనియర్ నాయకుడు ఆకెపోగు ప్రభాకర్ కేవలం పార్టీ జిల్లా కార్యాలయానికే పరిమితమయ్యారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లా తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల పనితీరుపై రాష్ట్ర పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులతో నివేదిక కోరుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని నియోజకవర్గాల వారీగా వాస్తవ పరిస్థితులను సేకరించి నివేదికను రూపొందించి అధిష్టానానికి పంపేందుకు జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సిద్దం చేసింది. అయితే సమాచారాన్ని టీడీపీ జిల్లా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలకు కోవర్ట్‌గా చేరవేశారు. సదరు ఉద్యోగి నివేదికను దొంగిలించి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు తన వాట్సాప్ ద్వారా పంపారు. సమాచారం తెలుసుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పార్టీలో ఇంత వ్యతిరేకత, అసంతృప్తి ఉందా? అంటు నివేదిక అధిష్టానానికి చేరుతున్నదని మేల్కొన్నారు. వెంటనే జిల్లా అధ్యక్షురాలు క్రిష్ణమ్మతో గొడవకు దిగినట్లు సమాచారం. ఓ ప్రజా ప్రతినిధి ఏకంగా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జిల్లాలోని పరిస్థితులను తమతో సంప్రదించకుండానే పార్టీ అధిష్టానానికి ఎలా నివేదిస్తావంటూ, అధ్యక్షురాలిని నిలదీసినట్లు సమాచారం.
పార్టీలు మారే వారికే
పదవులంటూ పత్తికొండలో అలక
పార్టీలో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన తుగ్గలి నాగేంద్రకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవితో పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల పార్టీలోని సీనియర్లు అలక వహించారు. నియోజకవర్గంలో సీనియర్ నాయకులను సమన్వయం చేసుకోవడంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ విఫలమయ్యారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నందున ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించడం లేదు.
‘లీకు’ వ్యవహారంలో
పార్టీ కార్యాలయ మేనేజర్ బలి
పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ అధిష్టానానికి పంపిన నివేదికకు సంబంధించిన అంశంపై పార్టీ కార్యాలయంలో 40 సంవత్సరాలుగా ఎంతో నమ్మకస్తుడిగా పనిచేస్తున్న మేనేజర్‌పై వేటు పడింది. ఈ నివేదికను లీక్ చేశారనే నెపం మోపి ప్రజా ప్రతినిధులంతా కలిసి మేనేజర్‌ను ఇంటికి పంపారు. జిల్లా పార్టీకి సంబంధించిన వ్యవహారంపై కోవర్ట్‌గా పనిచేసిన ఉద్యోగిని కాదని మేనేజర్‌పై ఎలా వేటు వేస్తారని ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
అధ్యక్ష పదవి కోసం పూర్వాధ్యక్షుల పాట్లు
అధిష్టానానికి నివేదిక పంపిన ఎపిసోడ్‌ను సాకుగా చూపుతూ ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మను తప్పించి వేరొకరికి అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు పూర్వ అధ్యక్షులు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ డిమాండ్‌ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోగా, ఓ బీసీ మహిళను తప్పించి వేరొకరికి పదవి ఇస్తే పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని సున్నితంగా తిరస్కరించినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మంత్రి, ఎమ్మెల్యేల పనితీరుపై
అధిష్టానానికి ఫిర్యాదు
ఆలూరులో ఇన్‌చార్జి మార్పు తప్పనిసరి
మంత్రాలయంలో అంతర్గత పోరు
కర్నూలు, ఎమ్మిగనూరులో
ఒంటెద్దు పోకడ
కోడుమూరులో ఎమ్మెల్యేని కాదని
విష్ణుదే పెత్తనం
జిల్లా అధ్యక్షరాలిపై మంత్రి,
ఎమ్మెల్యేల తిరుగుబాటు


