● టీబీ బోర్డు కార్యాలయం ఎదుట
ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆందోళన
మంత్రాలయం: కూటమి ప్రభుత్వం ఎల్లెల్సీకి నీరు విడుదల చేయించకపోతే కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన బళ్లారిలోని తుంగభద్ర బోర్డు కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో నీరున్నా ఖరీఫ్ పంటలకు నీరందించే విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 93 టీఎంసీల నీరున్నా.. సాగునీరు అందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గమన్నారు. సాగునీరు లేక ఎల్లెల్సీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 84 టీఎంసీలు ఉండగానే ఎల్లెల్సీ, హెచ్‌ఎల్‌సీకి నీళ్లు పారించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఐఏబీ మీటింగ్ కూడా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. రైతులు వానల్లేక అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే రగిలిపోతున్న రైతన్నల ఆగ్రహం చవిచూడక తప్పదన్నారు. అనంతరం బోర్డు డీఈ చెన్నకేశవ నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్రరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారయ్య, మంత్రాలయం, హాలహర్వి మండల కన్వీనర్లు జి.భీమారెడ్డి, రామిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, ఏకాంబర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


