● మూడు రోజుల పాటు న్యాయవాదులు విధుల బహిష్కరణ
కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం ఆ సంఘం అధ్యక్షులు చంద్రుడు అధ్యక్షతన నిర్వహించారు. పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరై హైకోర్టు శాశ్వత బెంచ్ కాకుండా క్యాంప్ కోర్టు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి లోకేష్ ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా 90 రోజుల్లో హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారని, ఇంతవరకు స్పష్టమైన ప్రకటన రాకపోవడం న్యాయవాదులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో కర్నూలు జిల్లా న్యాయవాదులతో పాటు అనంతపురం న్యాయవాదులు గళం విప్పారని, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సోమ, మంగళవారాలు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరముందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. సీనియర్ న్యాయవాదులు శివరామయ్య, రామసుబ్బారెడ్డి, నాగేంద్రనాథ్, కపిలేశ్వరయ్య, నాగభూషణం నాయుడు, రవి గువేరా, ఓంకార్, మురళిమనోహర్ తదితరులు కూడా న్యాయవాద సంఘం ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
క్వింటా ఉల్లి రూ.3,750
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర మరింత పెరుగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో నెలల తరబడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, సాగు చేసిన పంట కూడా దెబ్బతినడంతో ధరలను పొందే అవకాశం రైతులకు లేకుండాపోయింది. మార్కెట్‌కు కేవలం 226 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు మాత్రమే వచ్చాయి. కనిష్ట ధర రూ.2,217, గరిష్ట ధర రూ.3,750 లభించగా.. సగటు ధర రూ.3,069 నమోదైంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వేరుశనగకు గరిష్టంగా రూ.9,011, మొక్కజొన్నకు రూ.2,419, కందులకు రూ.7,597 ప్రకారం ధరలు లభించాయి.


