● సీపీఐ ఆధ్వర్యంలో జెడ్పీ నుంచి
కలెక్టరేట్ వరకు ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): కర్నూలు జిల్లాను కరువుగా ప్రాంతంగా ప్రకటించాలని అన్నదాత గర్జించాడు. సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కర్షకులు తరలివచ్చి ఆదుకోకపోతే అత్మహత్యలు తప్ప మరోదారి లేదని, తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. మంగళవారం సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ధర్నానుద్దేశించి ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లాలోని ఎల్‌ఎల్‌సీ నుంచి రైతులకు సాగునీటిని విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు ప్రాంతంగా ప్రకటిస్తే రైతులకు బీమా వర్తిస్తుందని, ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చి కొంత వరకై నా పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు తప్ప మరోదారి లేదన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టబుడి సాయాన్ని రూ.50 వేలకు పెంచాలన్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని కోరారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే భవిష్యత్‌లో పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పి.రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


