కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3,23,332 హెక్టార్లలో (74 శాతం భూముల్లో) పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు 2,39,774 హెక్టార్లు ఉండగా 2,21,801 హెక్టార్లలో సాగైంది. మిగిలిన పంటలన్నీ కలిపి 1,01,531 హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లాలో వరి సాధారణ సాగు 13,243 హెక్టార్లు ఉండగా 152 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ 19,988, ఆముదం 8,422, కంది 47,020, ఉల్లి 4,988, మిర్చి4,149, సజ్జ 4,356, మొక్కజొన్న 1,522, కొర్ర 448, టమాట 1,497 హెక్టార్ల ప్రకారం సాగయ్యాయి. వర్షాభారంతో పత్తి, కంది, ఆముదం, ఉల్లి, టమాట తదితర పంటలు లక్ష హెక్టార్ల వరకు దెబ్బతిన్నాయి.
9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కర్నూలు(అర్బన్): జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
బీఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseema university.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. నాల్గవ సెమిస్టర్‌కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 3,241 మంది పరీక్షలు రాయగా.. 2,829 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 203 మంది పరీక్షలు రాయగా 124 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
శాకంబరీగా కొలనుభారతి
కొత్తపల్లి: కొలనుభారతీ క్షేత్రంలో శుక్రవారం శాకంబరీ ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం సరస్వతీదేవి అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శాకాలంకరణ, ఉత్సవ సంబంధిత పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ముందుగా అర్చకులు, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శివమ్మ, శ్రీశైల దేవస్థానం ఏఈఓ ఫణీంద్ర ప్రసాద్, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాముకాటుతో
వలస కూలీ మృతి
కొందుర్గు: పాముకాటుతో వలస వెళ్లిన మహిళా కూలీ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గులో చోటుచేసుకుంది. పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులతోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్‌కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్‌సీకి అక్కడి నుంచి షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు చెప్పారు.


