శ్రీశైలంటెంపుల్: వర్షాలు కురిసి పంటలు బాగా పండి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో శ్రీశైల దేవస్థానం ఐదు రోజుల పాటు చేపట్టిన వరుణయాగ సహిత ఘటాభిషేక విశేష పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభ పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యురాలు జి.గంగమ్మ పాల్గొని ప్రధానాలయ గోపురం నుంచి పసుపు, కుంకుమ, పూలు, రుష్యశృంగ మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం అక్కమమాదేవి అలంకార మండంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ, రుత్విగ్వరణం, రుష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపాలు జరిపించారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 36 మంది రుత్వికులు పాల్గొన్నారు.


