● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
కర్నూలు(సెంట్రల్): వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక తాము వద్దన్నా నేడు గాయపడిన, అవమానపడిన, కేసులు పెట్టించుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఆలూరు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వైకుంఠం మల్లికార్జునతో కలిసి అక్రమ కేసులో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని ములాఖత్‌లో కలసి ధైర్యం చెప్పారు. అనంతరం బైరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తను కాపాడుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కార్లను పగులగొట్టి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరగొట్టిన టీడీపీ నాయకులు తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. పోలీసులు దాడి చేసిన వారిని వదలి బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారంటే ఇది ఏ సంస్కృతికి దారి తీస్తుందో వారికే తెలియాలన్నారు. ముచ్చుమర్రిలో బోయ సామాజిక వర్గానికి చెందిన 8ఏళ్ల బాలిక తప్పి పోయి రెండేళ్లవుతున్నా బోయ కులస్తులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆదోని నియోజకవర్గం ధనాపురంలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే బి.పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు దళిత సర్పంచ్‌ను కాళ్ల దగ్గర నిలబెట్టుకొని దారుణంగా అవమానించినప్పుడు ఆ సామాజిక వర్గం నేతలు ఎందుకు స్పందించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే విషయంలో ఈ రెండు సామాజిక వర్గాలు నిరసనలు తెలుపడం విడ్డూరంగా ఉందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారని, ఇందుకోసం టీడీపీ నాయకులే సమయం, తేదీ చెప్పాలని సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ చర్చకు వస్తే తమ పార్టీ నాయకులు అందుకు సిద్ధమన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కేసులకు భయపడరన్నారు. ఎక్కడైనా అక్రమ కేసులు పెడితే పార్టీ అండగా నిలిచి పోరాడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఆలూరు నాయకుడు వైకుంఠం మల్లికార్జున మాట్లాడుతూ నాగరాజు అనే వ్యక్తి తాళి కట్టిన భార్య బట్టలు చింపి అవమానించాడని, అతడిని తీసుకెళ్లి జైలులో వేయకుండా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం దారుణమన్నారు.


