నేడు ‘నేతన్న సేవలో’ పథకం అమలు
ఎమ్మిగనూరు, నందివర్గంలో కార్యక్రమాలు
టీడీపీ నేతలు చెప్పిన వారే లబ్ధిదారులు
మగ్గం లేనివారు కూడా అర్హులే
అర్హులైన చేనేతకార్మికులకు అన్యాయం
కర్నూలు జిల్లాలో 3,750, నంద్యాల జిల్లాలో 719 చేనేత కార్మికుల కుటుంబాలను ఎంపిక
అర్హులకు న్యాయం జరగలేదు
టీడీపీ మహిళా నేత పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): పార్టీలకు అతీతంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. చేనేత కార్మికుల కోసం రెండేళ్ల తర్వాత అమలు చేస్తున్న నేతన్న సేవలో టీడీపీ నేతల సిఫార్సులకే పెద్ద పీట వేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి నియోజకవర్గం నందివర్గంలో కార్యక్రమాలు నిర్వహించను న్నారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.25 వేల ప్రకారం నిధులు విడుదల చేయనున్నారు.
టీడీపీ నేత జోక్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం అర్హులందరికీ అందజేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. అర్హతకు పెద్దపీట వేశారు. నేతన్న సేవలో అంటూ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు అమలు చేయలేదు. ప్రస్తుతం అర్హులైన చేనేతకార్మికులను పక్కన పెటి సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత జోక్యం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ఆ నేత ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం.
అనర్హులే ఎక్కువ
నేతన్న సేవ పథకానికి ఉచిత విద్యుత్‌తో లింక్ పెట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ నేతన్న నేస్తం కింద లబ్ధిపొందిన వారి జాబితాలను పరిశీలన కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు పంపారు. తమకు వచ్చిన జాబితాలోని పేర్లనే పరిశీలిస్తున్నామని చెప్పిన సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓలు తర్వాత టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనర్హులకు సైతం పెద్దపీట వేశారు. కర్నూలు జిల్లాలో 3,259 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 590 పేర్లను పరిశీలన కోసం పంపగా...పలువురు అనర్హులకు స్థానం కల్పించారు. ఎమ్మిగనూరు నియోజక వర్గంలో 1,925 చేనేత కార్మిక కుటుంబాల పేర్లను పరిశీలన కోసం పంపగా..2,280 చేనేత కార్మిక కుటుంబాలకు నేతన్న సేవలో అర్హత ఉన్నట్లు ప్రకటించారు. ఒక్క ఎమ్మిగనూరు నియోజక వర్గంలోనే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అదనంగా 355 కుటుంబాలను చేర్చారు. ఇందులో అనర్హులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
గుర్తింపు కార్డులు ఇవ్వలేదు
ఎమ్మిగనూరు పట్టణంలో 30 మంది చేనేత కార్మికులు గుర్తింపు కార్డుల కోసం ఏడాది నుంచి అధికారుల చు ట్టూ తిరుగుతున్నారు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఉ ంచారు. వారి మగ్గాలను పరిశీలించి చేనేత, జౌళి శాఖ అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంది. వీరికి ఏ డాది నుంచి గుర్తింపు ఇవ్వలేదు. ఫలితంగా నేతన్న సే వలో పథకానికి వీరు దూరం అయ్యారు.రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు స్థానం కల్పించిన అధికారులు అద్దె ఇళ్లలో ఉంటున్న చేనేత కార్మికులను సైతం పక్కన పుంచారు. అద్దె ఇళ్లు అనే కారణంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందలాది మందికి అన్యాయం జరిగింది.
ఉమ్మడి జిల్లాలో 4,469 కుటుంబాల ఎంపిక
నేతన్న సేవలో పథకం కింద కర్నూలు జిల్లాలో 3,750, నంద్యాల జిల్లాలో 719 చేనేత కార్మికుల కుటుంబాలను ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం. మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రయత్నించిన అధికారులను ప్రజాప్రతినిధులు భయపెట్టి దారిలోకి తెచ్చుకున్నారు. రాజకీయ జోక్యం పెరుగడంతో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని చేనేత కార్మిక సంఘాల నేతలే పేర్కొంటున్నారు. పలు చోట్ల అర్హులను పక్కన పెట్టి అనర్హులకు స్థానం కల్పించారనే విమర్శలు వస్తున్నాయి.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మగ్గాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే చేనేత వృత్తి నుంచి వైదొలిగిన వారు టీడీపీ నాయకురాలిని ఆశ్రయించారు. అధికారులకు ఆమె ఫోన్ చేసి ప్రస్తుతం మగ్గం ఉన్నా.. లేకున్నా.. అందరి పేర్లు రాయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అనర్హులకు కూడా పెద్ద పీట వేశారు. ‘సార్... మాకు మగ్గం ఉంది, కొన్నేళ్లుగా చేనేత వృత్తిలోనే రాణిస్తున్నాం. అయితే జాబితాలో మా పేర్లు రాలేదనే కారణంతో పక్కన పెట్టారు.’అని నిజమైన చేనేతకార్మికులు అధికారుల దృష్టికి తీసుకపోయినా ఫలితం లేకుండా పోయింది.
నేతన్న సేవలో నిజమైన చేనేతకార్మికులకు న్యాయం జరగలేదు. అనర్హులకు పెద్దపీట వే యడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా వస్త్రాలను తయారు చేయడమే ప్రధానవృత్తిగా పెట్టుకొని రాణిస్తున్న కుటుంబాలను పక్కన పెట్టడం దారుణం. ప్రభు త్వం చొరువ తీసుకొని అర్హులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. – కాలప్ప, చేనేతకార్మిక
సంఘం ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగనూరు


