పులి దాడిలో రెండు ఆవులు మృతి | - | Sakshi
Sakshi News home page

పులి దాడిలో రెండు ఆవులు మృతి

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

మిద్దె పైనుంచి పడి యువకుడి మృతి

బండిఆత్మకూరు: మండలంలోని సింగవరం గ్రామ సమీపంలోని ఆముదాల చెరువు వద్ద పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ నాసిర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆవులకు కళేబరాలకు పార్నపల్లె పశువైద్యాధికారి జ్యోత్స్న పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన ఆవులు సోమయాజులపల్లెకు చెందిన తెలుగు సుబ్బరాయుడు, శ్రీనివాసులు అనే రైతులకు చెందినవని అధికారులు తెలిపారు. ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. పెద్దపులి సంచరిస్తున్నందున సింగవరం, జీసీ పాలెం, నెమళ్లకుంట, లింగాపురం, నాయినిచెరువు, రామాపురం, సోమయాజుల పల్లె, మణికంఠపురం గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పశువులు మేపడానికి అటువైపు వెళ్లవద్దని రైతులను హెచ్చరించారు.

బేతంచెర్ల: పట్టణంలోని కోటపేట కాలనీలో ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామానికి చెందిన పెద్దస్వామి, సుంకమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీను (21) తన అక్క ఓలమ్మ, బావ చిన్నరాముడు ఊరైన బేతంచెర్లకు బుధవారం వచ్చాడు. రాత్రి ఇంటిపైన రెండవ ఫ్లోర్‌లో పడుకోగా వర్షం రావడంతో కిందకు దిగివచ్చే క్రమంలో ప్రమాదశాత్తు పైనుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చేతికి వచ్చిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి సుంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ కేశవ రెడ్డి వెల్లడించారు.

గొర్రెలకు మేతగా పత్తి పైరు

గోనెగండ్ల: ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలను ఎదుర్కొని, అప్పులు చేసి మరి సాగుచేసిన పంటలు వర్షాలు లేక కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక కొందరు పైర్లను దున్నేస్తుండగా మరికొందరు పశువులకు మేతగా వదిలేస్తున్నారు. మండల పరిధిలోని వేముగోడు గ్రామానికి కౌలు రైతు రామారావు ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. బోరులో నీళ్లు అడుగంటిపోయాయి. పైరుకు నీరందక ఎదుగుదల లేకపోవడంతో గురువారం గొర్రెలకు మేతగా వదిలేశాడు.

రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాను

నేను ఎనిమిదెకరాల్లో పత్తి సాగుచేసి రూ.1.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో మొక్క పెరగలేదు. దిగుబడులు ఎలాగు రావని తెలిసి పంటను గొర్రెలకు మేతగా వదిలేశాను. ఆశలన్నీ పంటపైనే పెట్టుకున్నా, చివరకు అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా చేసి ఆదుకోవాలి.

– రామారావు, వేముగోడు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement