● రూ.2.80 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
కర్నూలు(టౌన్): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదుతో గురువారం తెల్లవారు జామున నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గోపాల రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని పెద్దపాడులో ఆయన నివసిస్తున్న మైత్రీ వనం ఇంటితో పాటు జొహరాపురం, ఆరోరానగర్, నంద్యాల సబ్‌రిజిస్ట్రర్ కార్యాలయం,అలాగే ఆయన బంధువుల ఇళ్లు, హైదరాబాదు, అనంతపురం ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సోదాల్లో బాలాజీనగర్‌లో జీ ప్లస్ 2 భవనం, ఉల్చాల వద్ద రెండస్తుల భవనం, 5 చోట్ల ఇళ్ల స్థలాలు, ఒక కారును గుర్తించారు. ఏసీబీ ఇంచార్జి డీఎస్పీ సీతారామరావు మాట్లాడుతూ సోదాలు కొనసాగుతున్నాయని, బంధువుల ఇళ్లతో పాటు బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు సోదాల్లో రూ.2.80 కోట్లు విలువ చేసే ఆస్తులు బయట పడినట్లు చెప్పారు.


