కర్నూలు (టౌన్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రుడు డిమాండ్ చేశారు. గురువారం కొత్తపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదుల సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో ఆదోని పట్టణంలో జరిగిన సభలో 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారన్నారు. అయితే పత్రికల్లో వస్తున్న సమాచారం మేరకు క్యాంప్ లేదా సర్క్యూట్ బెంచ్‌కే పరిమితం చేస్తున్నారన్నారు. దీనివల్ల న్యాయవాదుల్లో ఆందోళన పెరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అధికారికంగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు.


