నీటి ఎద్దడి నివారించాలి | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారించాలి

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

తాత్కాలిక ఉపశమనం, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వలేమనే అపోహలు వీడండి వరద ప్రవాహం తగ్గే సమయంలోనే రిజర్వాయర్లను నింపుకోవాలి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి సూచన

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో తాగు, సాగు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి సూచించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది అనేక గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, అలాగే వ్యవసాయానికి సాగు నీరు అందని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ప్రక్రియలో ప్రజలు, రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతో పాటు, శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గురువారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో జరిగిన ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ మనోహర్‌, నంద్యాల ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి శ్రీనివాసులు, ఈఈలు అబ్దుల్‌ఖాదర్‌, పద్మజ, ఇరిగేషన్‌ అధికారులు రాజన్‌బాబు, సుబ్రమణ్యంరెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాలువలకు నీరు వదిలితే సమస్య తగ్గుముఖం

తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి నంద్యాల జిల్లాలో కుందూ నదికి నీరు సమృద్ధిగా వస్తే, కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేస్తే పలు గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుందని నంద్యాల ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి శ్రీనివాసులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఎల్‌ఎల్‌సీ నీరు విడుదలవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో 60 నుంచి 70 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయని పర్యవేక్షక ఇంజినీర్‌ సీహెచ్‌ మనోహర్‌ చెప్పారు. అలాగే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు కూడా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నీటి సమస్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

సమావేశంలో హుందాగా వ్యవహరించాలి

సమావేశం జరుగుతున్న సమయంలో ఆస్పరి జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు మాట్లాడుతూ మండంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నాగనాథనహళ్లి వాటర్‌ స్కీం నుంచి ఆదోని మండలంలోని పలు గ్రామాలకు నీరు ఇవ్వడం వల్ల సమస్య జఠిలంగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఉద్దేశించి ఆయన మాట్లాడటం పట్ల ఏఈలు తాము కూర్చున్న స్థానాల నుంచి లేచి సమావేశం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అందరూ కూర్చోవాలని ఎస్‌ఈ మనోహర్‌ కోరడంతో ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశాల్లో ఎవరు పరుషంగా మాట్లాడినా, నివారిస్తామన్నారు. ఏఈల తీరు పట్ల ఆయన ఇట్‌ ఈజ్‌ బ్యాడ్‌ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

పలు అంశాలు సమావేశం దృష్టికి..

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పలు అంశాలను వివిధ మండలాలకు చెందిన ఏఈలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎస్‌ఎస్‌ ట్యాంకులు, గుర్తించిన సోర్స్‌ నుంచి గ్రామం వరకు నీటిని తీసుకువెళ్లినా, గ్రామ పంచాయతీల్లో నిర్వహణ లోపం వల్ల కూడా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఏఈలు చెప్పారు. అలాగే పలు గ్రామ పంచాయతీల్లో వాటర్‌మెన్స్‌కు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వేసిన పైప్‌లైన్లు పాడైపోవడం వల్ల కూడా డిజైన్‌ ప్రకారం చివరి ప్రాంతాలకు నీరు అందని పరిస్థితి నెలకొనిందని పలువరు ఏఈలు వాపోయారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో శివారు కాలనీలు పెరగడం వల్ల కూడా నీటిని నిర్ణీత సమయానికి వారి అవసరాల మేరకు అందించలేకపోవడం తదితర కారణాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పలు గ్రామాలకు అదనంగా బోర్లు మంజూరు చేయాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు జగదీశ్వరరెడ్డి, యుగంధర్‌రెడ్డి, మౌలాలి, బీ రఘునాథ్‌రెడ్డి, రామకృష్ణ, మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రంగనాథ్‌గౌడ్‌, రాజ్‌కుమార్‌, ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖరీఫ్‌కు నీరు ఇవ్వాల్సిందే...

ప్రస్తుత ఖరీఫ్‌కు కచ్చితంగా జిల్లాలోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఖరీఫ్‌కు నీటిని విడుదల చేయలేమనే అపోహలో ఇరిగేషన్‌ ఇంజినీర్లు ఉన్నారని, అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో సంతృప్తికర స్థాయిలో ఉందన్నారు. ముఖ్యంగా వరద ప్రవాహం తగ్గుతున్న సమయంలోనే ముందస్తుగా జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను టాప్‌అప్‌ చేసుకోవాలన్నారు. ఈ విధంగా అన్ని రిజర్వాయర్లను నింపుకుంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement