నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం
జిల్లాలో 1,445 ప్రభుత్వ పాఠశాలలు
వాటిలో చదివే విద్యార్థులు
2.49 లక్షల మంది
రెండేళ్లుగా పైసా ఖర్చు పెట్టని చంద్రబాబు ప్రభుత్వం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన పనులతోనే ఆర్భాటం
ఇప్పటి వరకు పాఠశాలలకు చేరని ‘విద్యార్థి మిత్ర’ కిట్లు
ఆదోనిలోని ఆర్‌ఆర్ కాలనీలో రెండేళ్లుగా నిలిచిపోయిన హైస్కూల్ భవనం పనులు
అద్భుతమైన ప్రవేశ ద్వారాలు.. ఆకర్షణీయమైన బెంచీలు.. తళుక్కున మెరిసే గ్రీన్ బోర్డులు.. ‘స్మార్ట్’ బోధన.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పటి మాట. విద్యార్థుల కాళ్లకు బూట్లు రాలేదు.. టైలు, బెల్టులు లేవు.. యూనిఫాం ఎప్పుడు వస్తుందో తెలియదు.. నిర్మాణంలో ఉన్న తరగతి గదులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం.. ఇదీ నేటి మాట. అర్ధంతరంగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణం..‘చిక్కీ’పోయిన మధ్యాహ్న భోజనం.. కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించని దౌర్భాగ్యం.. ఇలా ఎన్నో సమస్యలతో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అద్వితీయమైన అభివృద్ధి కనిపించింది. నేడు సర్కారు స్కూళ్లలో ప్రగతి తడబడి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
గోనెగండ్ల మండల వీరంపల్లి గ్రామంలో మరుగుదొడ్డి దుస్థితి
కర్నూలు సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులు కనిపించడమే లేదు. వాటిలో చదివే పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరిన భవనాలే దిక్కయ్యాయి. యూనిఫాం, బూట్లు, పాఠ్య, నోటు పుస్తకాలు అందని దుస్థితి అంతటా కనిపిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులను అర్ధంతరంగా ఆపేశారు. అదనపు తరగతి గదులు అందుబాటులోకి రాకపోగా.. డిజిటల్ విద్య దూరమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాడు ఒక్కొక్కరికి
రూ.2,419 విలువైన విద్యా కానుక
విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుకను విద్యార్థుల చేతికి అందజేసిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఏటా జూన్ 12వ తేదీకి ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక పేరిట మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్‌లు ఇచ్చేవారు. అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్సనరీలు, 1 నుంచి 5 తరగతులకు పిక్టోరియల్ డిక్సనరీలు అందించేవారు. ఒక్కొక్కరికి రూ.2,419 విలువైన విద్యాకానుకను అందించేవారు.
నేడు కినుక వహించిన ‘విద్యార్థి మిత్ర’
జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2.64 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్ బుక్స్ ఇవ్వాల్సి ఉంది. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్‌లు మాత్రమే పునఃప్రారంభం రోజున ఇవ్వనున్నారు. మిగిలినవి ఎప్పుడు ఇస్తారో విద్యాశాఖ అధికారులకే స్పష్టత లేదు.
● నోట్ బుక్స్ 14,82,441 గాను 5,88,513, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు 28,298 వచ్చాయి. అన్నీ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి.
● బెల్టులు 1 నుంచి 10 వరకు బాలురు, 1 నుంచి 5 వరకు బాలికలకు 1,85,471 అవసరం కాగా ఇప్పటి వరకు ఒక్కటీ కూడా రాలేదు.
● వర్క్‌బుక్‌లు 1,80,153గాను 1,69,465 మాత్రమే రాగా,25 మండలాలకు పంపించారు.
● టెక్ట్స్ బుక్‌లు 11,90,147 రాగా వాటిలో 9,79,822 26 మండల కేంద్రాలకు పంపించారు. ఇందులో సగం కూడాస్కూల్ పాయింట్‌కు చేరలేదు.
● బూట్లు 2,64,885 అవసరం ఉండగా ఒక్కటి కూడా రాలేదు.
● పిక్టోరియల్ డిక్షనరీలు (ఫస్ట్ క్లాస్) 17,926 అవసరం ఉండగా 4,880 మాత్రమే జిల్లాకు వచ్చాయి. వాటిని ఎనిమిది మండలాలకు పంపిణీ చేశారు.
● యూనిఫాం 2,64,885 మందికి ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 44,572 మందికి మాత్రమే రావడంతో నాలుగు మండలాలకు సరఫరా చేశారు.
‘చిక్కీ’పోయి!
ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని భావించిన గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించింది. రోజుకో మెనూతో విభిన్న వంటకాలు, వారానికి మూడు రోజులు చిక్కీ, మూడు రోజులు రాగి జావ, వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు ఇచ్చేవారు. విద్యార్థులు జావ తాగేందుకు వీలుగా స్టీలు గ్లాసులు సైతం నాటి ప్రభుత్వం సమకూర్చింది. ఈ పథకం పేరును కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. ఈ పథకం కింద స్కూళ్లకు కేవలం బియ్యం మాత్రమే చేరాయి. కోడిగుడ్లు, చిక్కీలు స్కూళ్లకు చేరలేదు. దీంతో పాటు రాగిపండి, బెల్లం సైతం స్కూళ్లకు పూర్తి స్థాయిలో చేరలేదు.
ప్రగతిని ‘నీరు’గార్చారు!
కర్నూలు కేవీఆర్ గార్డెన్‌లోని ఉర్దూ హైస్కూల్‌లో రెండేళ్లుగా నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్
చంద్రబాబు ప్రభుత్వంలో పడిగాపులు‘బడి’
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనబడి నాడు– నేడు పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పేరొస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను నిలిపివేశారు. దీనికి తోడు పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను సైతం మార్పులు చేసి అశాసీ్త్రయంగా తొమ్మిది రకాల బడులుగా విభజించారు. విద్య వ్యవస్థలను మంత్రి లోకేష్ అస్తవ్యస్తం చేశారు. డీఎస్సీ ద్వా రా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీకి చేసి నా కూడా సర్కార్ బడుల్లో ప్రామాణికమైన విద్య పతనావస్ధకు చేరిందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. పీఎంశ్రీ పథకం కింద చేపట్టిన పనులు చేస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో రాక అగుతూ..సాగుతున్నాయి. కేజీబీవీల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు, డార్మెటరీల పనులు సైతం పూర్తి కాలేదు.
జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా వాటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు 1,445 ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు చేపట్టింది. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ. 166.25 కోట్లు ఖర్చు చేసి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండో విడతలో 1,051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రవేశ ద్వారాలు, ఆర్చీలు, ఆకర్షణీయమైన బెంచీలు, విద్యుత్ సదుపాయం, తాగునీరు, రన్నింగ్ వాటర్‌తో టైల్స్‌తో కూడిన టాయిలెట్ల వంటివి ఏర్పాటు చేశారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో రూ.24.47 కోట్లు వెచ్చించి 567 పాఠశాలల్లో మొదటి విడతలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రెండో విడతలో 709 పాఠశాలల్లో రూ.23.05 కోట్లు ఖర్చు పెట్టి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పనులు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో వందకుపైగా ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మిగిలిన వాటిలో సగానికిపైగా ఇంత వరకు ఇన్‌స్టాలేషన్ చేయలేదని తెలుస్తోంది.


