విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలుడి మృతి
గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి మగపిల్లవాడు లేకపోవడంతో రాజు భార్య అరుణమ్మ చెల్లెలు నాగమణి కుమారుడు రిషీనిమూడేళ్ల క్రితం దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే విధి వక్రీకరించించి గురువారం ఉదయం బాత్‌రూములో ఉన్న హీటర్‌ను పట్టుకుని రిషీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
కర్నూలు టౌన్ డీఎస్పీగా రాఘవేంద్ర
కర్నూలు (టౌన్): కర్నూలు టౌన్ డీఎస్పీగా కేవీ రాఘవేంద్ర నియమితులయ్యారు. గురువారం రాత్రి డీజీపీ కార్యాలయ వర్గాల నుంచి నియామాక ఉత్తర్వులు వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఎస్‌ఐగా, సీఐగా గుంటూరు జిల్లా పరిధిలో పనిచేశారు. కర్నూలులో డీఎస్పీగా పనిచేస్తున్న బాబు ప్రసాద్ వారం రోజుల క్రితం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు.


