నేడే పిడకల సమరం | - | Sakshi
Sakshi News home page

నేడే పిడకల సమరం

Mar 20 2026 8:12 AM | Updated on Mar 20 2026 8:12 AM

ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో

కొనసాగుతున్న సంప్రదాయం

పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు

ఆస్పరి: ఉగాది పండుగకు ఆస్పరి మండలంలో ఓ ప్రత్యేకత ఉంది. పండగ మరుసటి రోజు మండలంలోని కై రుప్పల గ్రామంలో ప్రేమికులను గెలిపించేందుకు పిడకల సమరం జరుగుతుంది. వీరభద్రస్వామి, కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరుగుననున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి సాయంత్రం ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్‌, గ్రామపెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకను తిలకించేందుకు మండలంలోని ఆస్పరి, కారుమంచి, బిల్లేకల్‌, చెన్నపల్లి, పుప్పాలదొడ్డి, యాటకల్‌, కలపరి, దొడగొండ, తురువగల్‌, అలారుదిన్నె, ముత్తుకూరు తదితర గ్రామాల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ, తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు.

మొక్కుబడిగా భక్తులు పిడకల సమర్పణ

కోరిన కోరికలు నెరవేరితే భక్తులు నగలు, పట్టు వస్త్రాలు, కానుకలు సమర్పించడం సర్వసాధారణం. అయితే కై రుప్పల గ్రామంలో అందుకు భిన్నంగా భక్తులు వీరభద్రస్వామికి పిడకలు సమర్పించి మొక్కుబడి తీర్చుకుంటారు. స్వామివారి సన్నిధిలో శుక్రవారం జరిగే పిడకల సమరానికి నుగ్గులు సిద్ధం చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు వారికి తోచిన విధంగా పిడకలను ఆలయ ఆవరణలో రాశులుగా పోసి మొక్కుబడి తీర్చుకుంటారు.

నేపథ్యమిది ..

విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వీరభద్ర స్వామిని అవమాన పరచాలని నిశ్చయించుకొని తమకు అందుబాటులో ఉన్న పిడకలతో స్వామితో పాటు ఆయన వర్గీయులపై దాడి చేస్తారు. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగుతారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ దాడి, ప్రతిదాడి రణ రంగాన్ని తలపించింది. తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి నిమ్న కులానికి చెందిన కాళికాదేవిని, అగ్రవర్ణానికి చెందిన వీరభద్రస్వామికి వివాహం చేశారని పెద్దలు చెబుతారు. ప్రాణాలకు తెగించి తమ కోసం పోరాడిన తమ వర్గీయుల కోరికలను వీరభద్రస్వామి, కాళికాదేవి తీర్చారట. ఈ నేపథ్యంలోనే ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు స్వామి, అమ్మవారి భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తుంది.

కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవి

సమరం ఇలా సాగుతుంది

పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి తదితర గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచి తమ ఇంటిలో ఉన్న పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement