● జీపీఎస్ జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్
కర్నూలు(అర్బన్): గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం చేస్తామని గిరిజన ప్రజా సమాఖ్య (జీపీఎస్) జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు వడిత్యా శంకర్‌నాయక్ అన్నారు. కర్నూలు నగర శివారుల్లోని గిరిజన భవన్‌లో గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజునాయక్, రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ గిరిజన సంఘాల నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాది గిరిజన కుటుంబాలకు కనీస సదుపాయాలు లేవన్నారు. కనీసం రేషన్, ఆధార్‌కార్డులు కూడా లేని పరిస్థితి కొనసాగుతుండడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. రాష్ట్రంలో సుగాలి, చెంచు, ఎరుకల, యానాది, నక్కల వంటి అనేక గిరిజన జాతులు ఉన్నప్పటికీ వారికి సముచిత రాజకీయ ప్రాతినిఽథ్యం లేదన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచే ప్రతిపాదన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నారు. శ్రీశైలం దేవస్థానంలో గిరిజన సత్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీపీఎస్ గౌరవాధ్యక్షుడు కేజీ నాయక్, రాయలసీమ ఉద్యమ నేత సీమ కృష్ణ, సందీప్‌నాయక్, రామ్ బాలాజీ నాయక్, నాగస్వామి నాయక్, సుధాకర్‌నాయక్, శివనాయక్, వెంకటశివ నాయక్, బాలనాయక్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.


