● శ్రీశైలానికి తరలివస్తున్న కన్నడిగులు ● మల్లన్న దర్శనానికి బారులుదీరిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: తమ ఇంటి ఆడపడుచు అనుగ్రహం కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తూ అమ్మవారి చెంతకు చేరుకుంటున్నారు. ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి శ్రీశైల భ్రమరాంబ దేవికి భక్తిశ్రద్ధలతో మొక్కు లు తీర్చుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉత్సవాల కంటే ముందుగానే శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. దర్శనం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వేలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. సోమవారం ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు నాలుగు విడతలుగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు.


