ఈ బస్సులకు ఏమైంది?
హొళగుంద: ఏ సమయంలో ఎక్కడ నిలబడి పోతాయో తెలియని డొక్కు బస్సులను ఆర్టీసీ అధికారులు హొళగుంద మండలానికి తిప్పుతున్నారు. శనివారం మార్లమడికి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న ఆర్టీసి బస్సు స్థానిక ఎల్లెల్సీ(తుంగభద్ర దిగువ కాలువ) వద్ద ఏయిర్ లాక్ కావడంతో నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ బస్సును ముందుకు నడిపేందుకు తీవ్రంగా ప్రయత్నించి వీలు కాక హొళగుందలోనే నిలిపేశాడు. అసలే మండలానికి అరకొరగా తిరిగే బస్సుల్లో ఆదోని డిపో అధికారులు పూర్తి కండిషన్ లేని బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. బస్సులు కాలం చెల్లి, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతూ గ్రామాలకు కచ్చితంగా చేరుతామనే నమ్మకం కూడా లేదు. ఇటీవల కాలంలో బస్సులు మరమ్మతులకు గురై ఎక్కడబడితే ఆగిపోతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు గంటల పాటు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక విద్యార్థులు పాఠశాల నుంచి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. తరచూ ఈ సమస్యలు తలెత్తినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి మండలానికి కండిషన్‌లో ఉన్న బస్సులను నడపాలని డిమాండ్ చేస్తున్నారు.


