● జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్): తక్కువ పెట్టుబడితో ఉత్పాదకత పెంచుకుని అధిక నికరాదాయం పొందుతూ వ్యవసాయంలో రాణించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీల్ వరలక్ష్మి అన్నారు. శనివారం కర్నూలులోని ఉద్యానభవన్‌లో కర్నూలు డివిజన్ లోని రైతులు, వ్యవసాయ అధికారులు, వీఏఏలు, ఏఈవోలతో శాస్త్రవేత్తలకు కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. సదస్సుకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. రసాయన ఎరువులు అడ్డుగోలుగా వాడవద్దని, భూసార పరీక్ష ఫలితాలకు లోబడి మాత్రమే వినియోగించాలని సూచించారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న, శనగ, జొన్న, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కంది తదితర పంటల్లో చీడపీడల నియంత్రణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను వివరించారు. ఆత్మ పీడీ శ్రీలత మాట్లాడుతూ... ఆత్మ కార్యక్రమం ద్వారా రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమన్వయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్, బనవాసి కేవీకే శాస్త్రవేత్తలు, కర్నూలు, కల్లూరు, కోడుమూరు, గూడూ రు, ఓర్వకల్, సీ.బెళగల్ మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.


