కక్ష ఎవరిది.. శిక్ష ఎవరికి?
రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం 80 శాతం పూర్తి
నాడు – నేడు పనులను నిలిపేసిన చంద్రబాబు సర్కారు
స్కూల్ ఖాతాలో రూ. 10 లక్షలు ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి
గదుల కొరతతో చెట్ల కింద చదువులు
238 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల, ఒకే మరుగుదొడ్డి
రాతనలో అసంపూర్తిగా ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం
తుగ్గలి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నాడు – నేడు పనులు నిలిచిపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీ కావు. పేద విద్యార్థుల కోసం చేపట్టిన భవనాలు చంద్రబాబు కక్షకు నిరుపయోగంగా మారాయి. ఇందుకు రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనమే నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న నాడు –నేడు మన బడి పథకం కింద రూపురేఖలు మార్చేశారు. చదువులే పేదల ఆస్తి.. అంటూ విద్యా రంగాన్ని పరుగులు పెట్టించారు. చదువులమ్మ గుడిలో అభివృద్ధి దీపం వెలిగించారు. విప్లవాత్మక మార్పులతో సర్కారు బడులు కొత్త రూపుదిద్దుకున్నాయి. అదనపు గదులు, ప్రహరీలు, నూతన భవనాలు, మౌలికవసతులు పూర్తి చేసుకుని .. ఇవి ప్రభుత్వ పాఠశాలలా.. అన్నట్లుగా మార్పు చెందాయి. కొన్ని చోట్ల పనులు ఆలస్యం కావడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇందులో రాతన జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం ఒకటి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు – నేడు కింద గ్రామ శివారులో నిర్మాణం చేపట్టి 80 శాతం పనులు పూర్తి చేసింది. ఈ లోగా ప్రభుత్వం మారడంతో నాడు–నేడు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షలు స్కూల్ ఖాతాలో ఉన్నాయి. అయితే చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక కక్ష గట్టి పనులు నిలిపివేసింది. ఉన్న నిధులను వాడుకునే వీలు లేకుండా ఫ్రీజ్ చేసింది. దీంతో పాత పాఠశాల భవనంలోనే విద్యార్థులు అవస్థల మధ్య విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు 238 మంది విద్యార్థులు ఉండగా.. మూడు ఇరుకైన గదుల్లో మూడు తరగతుల కు బోధన సాగుతోంది. మిగిలిన రెండు తరగతులు వరండా, చెట్ల కింద నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 238 మంది విద్యార్థులు, 13 మంది ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఉన్న ఒక మూత్రశాల, ఒక మరుగుదొడ్డితో చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు. దీంతో ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక క్రీడా మైదానం లేక క్రీడలకు నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం, పాలకులు స్పందించి అసంపూర్తి పాఠశాలల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
కక్ష ఎవరిది.. శిక్ష ఎవరికి?


