రైతులను ఆదుకోవడంలో బాబు సర్కారు విఫలం
ఉల్లికి రూ. 50 వేల నష్ట పరిహారం ఇంకెప్పుడిస్తారు
పత్తి, అరటి రైతుల కష్టాలు కనిపించవా?
సీఎంకు అమరావతిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వంగాల భరత్ కుమార్ రెడ్డి
కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు సర్కారు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వంగాల భరత్‌కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి కన్నా రెండింతలు రైతు సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసం చేశారన్నారు. ముమ్మాటికీ ఆయన రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైందన్నారు. ఏడాదిన్నరగా రైతులు అన్ని విధాలా నష్టపోతున్నా ఆదు కోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదన్నారు. పొగాకు, మిర్చి రైతుల ఇబ్బందులు తెలుసుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాతనే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడిందన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ
మంత్రి ఉన్నారా..?
రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా... అని భరత్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 11.50 లక్షల క్వింటాళ్ల పత్తిని పండిస్తే అందులో 5.50 లక్షల క్వింటాళ్లు కర్నూలు జిల్లా దిగుబడేనన్నారు. మోంథా తుపాన్‌తో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినా పాలకులు పలకరించడం లేదన్నారు. అసలు రాష్ట్రంలో సీసీఏ కేంద్రాలు పనిచేస్తున్నాయా..అని ప్రశ్నించారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఎంత మంది రైతులకు ఇచ్చారో.. ప్రకటించాలన్నారు. శనగ దిగుబడులు గోడౌన్లలో మగ్గు తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అరటి రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. రూపాయికి కిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు నాయుడుకు అమరావతి భవనాల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. రైతులు తిరగబడే రోజలు దగ్గర్లోనే ఉన్నా యని హెచ్చరించారు.. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి మల్లికార్జున, మైనార్టీ నాయకులు పత్తా బాషా, ఆర్టీఐ నాయకులు గద్ద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


