పల్లెలు తూలుతున్నాయ్ !
బేతంచెర్ల/పాములపాడు: చంద్రబాబు సర్కారు మద్యం బాబులకు తాగినోళ్ల తాగినంత.. అన్నట్లుగా మద్యాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతోంది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అర్ధరాత్రి తర్వాత మద్యం విక్రయాలు కనిపించకపోయినా పక్కనే ఉన్న పల్లెల్లో మాత్రం గ్లాసులు గలగలమంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలకు అధికారుల గ్రీన్ సిగ్నల్‌తో పగలు, రాత్రి తేడా లేకుండా దర్జాగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో యువత మత్తుకు బానిసై చిత్తువుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలకు సైతం మద్యం దుకాణాలు రావడంతో మందు బాబులు పట్టపగలే పీకలదాగా తాగి రహదారులపై పడిపోతున్నారు. బేతంచెర్ల మండలంలో గతంలో పట్టణంలో నాలుగు, ఒక బార్, ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో రెండు మద్యం దుకాణాలు ఉండేవి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక నూతనంగా సీతారామాపురం, సిమెంట్ నగర్ గ్రామాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. గతంలో పట్టణాలకే పరిమితమైన మద్యం దుకాణాలు గ్రామాలకు సైతం అందుబాటులోకి రావడం, మరో వైపు యథేచ్ఛగా బెల్టుషాపులు ఏర్పాటు చేయడంతో తాగినోళ్లకు తాగినంత అన్నట్లుగా నిత్యం మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. సీతారామాపురం గ్రామంలో మద్యం దుకా ణం ఏర్పాటు చేసిన రహదారిలో నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణంలో రైల్వే గేటు సమీపాన ఉన్న ఓ మద్యం దుకాణ దారుడు వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను చెత్త డస్ట్ బిన్‌లో వేయకుండా మద్యం దుకాణం వెనకాల ఉన్న శ్మశానం స్థలంలో వేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అలాగే మండల కేంద్రం పాములపాడులో మద్యం విక్రయాల్లో సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు మందుబాబులు ఫూట్‌గా మద్యం సేవించి రోడ్లపై పడిపోతున్నారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో బస్టాండ్ సెంటర్ సమీపంలో ఓ హోటల్ ముందు పడిపోయాడు. అలాగే మరో వ్యక్తి లింగమయ్య స్వామి అరుగుపై పొర్లుతూ కనిపించారు. వీరిని చూసిన జనం మద్యాన్ని విచ్చలవిడి విక్రయిస్తుండటంతో ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు.


