పెండింగ్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు
ఆలూరు: కరువు, కాటకాలకు నిలయమైన రాయలసీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు అనేక హమీలను ప్రకటించిన సీఎం చంద్రబాబు నేడు వాటి జోలికే వెళ్లడం లేదన్నారు. ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు కాగా కేవలం రూ.30 వేల కోట్లతో గురురాఘవేంద్ర, ఆర్డీఎస్, వేదావతి, గుండ్రేవులు సహా అనేక ప్రాజెక్టు పనుల్లో కదలిక వస్తుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో రైతులు పండించిన ఉల్లి, పత్తి, మామిడి పంటలకు ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరను కూడా కల్పించలేకపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నోరుమెదపకపోవడం దారుణమన్నారు. కృష్ణా బేసిన్‌లోని నీటిని దిగువ రాష్ట్రాలకు రాకుండా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాంను నింపుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికై నా భావి తరాలకు ఉపయోగపడేలా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే సీమ ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ క్షమించరన్నారు.


