
వీడియోలు తీసి.. నిలువునా దోచేసి!
దోపిడీ ముఠాతో పోలీసుల చెట్టాపట్టాల్
కర్నూలు: కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కొంతమంది పోలీసుల అండతోనే దోపిడీ ముఠా దొంగలు ప్రేమ జంటలను బెదిరించి నిలువుదోపిడీకి పాల్పడినట్లు పోలీసు విచారణలో బయటపడింది. కల్లూరు మండలం ముజఫర్ నగర్‌కు చెందిన రౌడీషీటర్ గోరంట్ల నాగేంద్ర, కురువ రమేష్, దిన్నెదేవరపాడుకు చెందిన దూదేకుల మాలిక్ బాషా ముఠాగా ఏర్పడి కొంతకాలంగా జగన్నాథగట్టు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులను నాల్గవ పట్టణ పోలీసులు శుక్రవారం కటకటాల్లోకి పంపారు. దోపిడీ ముఠా సభ్యులకు తాలూకా పోలీసుల సహకారం ఉన్నట్లు విచారణలో బయట పడినట్లు చర్చ జరుగుతోంది.
వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని కాదంబరి వెంచర్, జగన్నాథగట్టు ప్రాంతాలకు వెళ్లి ఏకాంతంగా గడిపే జంటలను గుర్తించి దోపిడీ ముఠా సభ్యుల్లో ఒకరైన దూదేకుల బాషా వీడియో తీస్తాడు. కురువ రమేష్ పోలీస్ తరహాలో వారి వద్దకు చేరి జంటలను బెదిరించి దాడి చేస్తాడు. ఆ తర్వాత కర్నూలు అర్బన్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే బ్లూ కోల్ట్స్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగానే ఓ కానిస్టేబుల్, ఓ హోంగార్డు అక్కడికి చేరుకుని ప్రేమ జంటలను బెదిరించి డబ్బు, బంగారం లాక్కుని వాటాలు వేసుకుని పంచుకుంటున్నట్లు విచారణలో బయటపడింది.
ముఠా వలలో రియల్ వ్యాపారి
కొన్ని నెలలుగా పోలీసులు, ముఠా సభ్యులు కలసి జగన్నాథగట్టు ప్రాంతాల్లో ప్రేమ జంటలు, ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు, యువకులను బెదిరించి భారీ మొత్తంలో నిలువుదోపిడీ చేసినట్లు చర్చ జరుగుతోంది. అలాగే ప్రేమ జంటలు శారీరకంగా కలుసుకునేటప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని లేదా తల్లిదండ్రుల వాట్సప్ గ్రూపులకు షేర్ చేస్తామంటూ బెదిరించి విడతల వారీగా ఫోన్‌పేలో డబ్బులు వేయించుకుని పోలీసులు కూడా పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. కర్నూలులో పేరు మోసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ ప్రాంతంలో ఓ మహిళతో ఏకాంతంగా ఉండగా ఇదే ముఠా సభ్యులు బెదిరించి 28 తులాల బంగారు నగలు లాగేసుకున్నట్లు సమాచారం. ఇలా వీరి ఉచ్చులో పడి బంగారం, వెండి, నగదు పోగొట్టుకున్న జంటలు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు తీసిన వీడియోలు కూడా పోలీసుల చేతికి చిక్కడం గమనార్హం. ఇందులో కర్నూలు అర్బన్ తాలూకా పోలీసుల పాత్ర కూడా బయటపడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
విచారణకు ఆదేశం
విషయం పోలీసు ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఎంతకాలంగా దోపిడీ దొంగలతో పోలీసులు దోస్తీ చేశారన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దోపిడీ దొంగల ముఠా అరాచకాలు బయట పడటంతో కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో కూడా ఇదే తరహాలోనే ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటనల్లో కానిస్టేబుళ్లు రమేష్, బాబురావు, మల్లికార్జున తదితరులు శాఖాపరమైన చర్యల్లో భాగంగా సర్వీసు నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజా బాగోతంలో ఎవరెవరిపై వేటు పడుతుందో వేచిచూడాలి.
ప్రేమ జంటలే ఆదాయవనరు
పోలీసు శాఖలో
చర్చనీయాంశమైన
బ్లూ కోల్ట్స్ సిబ్బంది పనితీరు
మరోసారి వివాదంలో
కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్