
27 ఏళ్ల తర్వాత సొంతూరుకు..
● బాలుడిగా వెళ్లి భార్యాబిడ్డలతో తిరిగి వచ్చాడు..
ఆదోని రూరల్: తల్లిదండ్రులు దూరమయ్యారు.. ఆ బాలుడిని పట్టించుకునే దిక్కు లేదు. కాలే కడుపు చేత పట్టుకుని ఆ 13 ఏళ్ల పిల్లోడు రైలెక్కాడు. ఎవరూ తెలియని ఊరిలో దిగి బతుకుదెరువు కోసం చిన్న చితకా పని చేసుకుంటూ పెద్దయ్యాడు. అక్కడే పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో జీవిస్తుండగా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సొంతూరుపై మమకారం పెరిగింది. 27 ఏళ్ల తర్వాత అతను తిరిగి వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి చెందిన పెద్దరంగన్న, నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలానికి ఆ దంపతులు మృతి చెందగా ఆ పిల్లలను ఆదరించే వారు కరువయ్యారు. రెండో కుమారుడైన లక్ష్మన్న 13 ఏళ్ల వయస్సులో దిబ్బనకల్ గ్రామం నుంచి నడుచుకుంటూ ఆదోని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రెండు రోజులు అక్కడే ప్రయాణికులు ఇచ్చే వాటితో కడుపు నింపుకున్నాడు. ఏమి చేయాలో తెలియక ఓ రైలెక్కగా అది పంజాబ్‌కు చేరుకుంది. అక్కడ లక్ష్మన్న చిన్న వయస్సులో నానా ఇబ్బందులు పడ్డాడు. బతకడానికి మెకానిక్ షెడ్‌లో పనిచేసుకుంటూ, లారీ క్లీనర్‌గా పనిచేశాడు. ఆ తర్వా త లారీ డ్రైవర్ అయ్యాడు. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రానికి చెందిన అనాథ అయిన రీనాను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం కలిగారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ లక్ష్మన్న కుటుంబాన్ని పోషిస్తుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. తన భార్య, పిల్లలను దృష్టిలో పెట్టుకుని డ్రైవర్ వృత్తి వద్దనుకుని సొంత గ్రామమైన ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం భార్య రీనా, పిల్లలతో కలిసి గ్రామానికి చేరుకున్నాడు. అయితే ఊరిలో లక్ష్మన్నను ఎవరూ గుర్తు పట్టలేదు. పంజాబీ భాష మాట్లాడుతుండడంతో ఎవరికీ అర్థంగాక అనుమానించారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పి ఆధార్‌కార్డులో తండ్రి పేరును చూపించడంతో తన బంధువులు గుర్తించారు. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని, తమ వాడేనని గ్రామస్తులకు వివరించారు. సొంత అన్న హైదరాబాద్‌కు, ఇద్దరు తమ్ముళ్లు బెంగళూరుకు వలస వెళ్లారు. ప్రస్తుతానికి లక్ష్మన్న చిన్న తమ్ముడు ఇంట్లో నివాసముంటున్నాడు. తన పిల్లలను కుటుంబానికి, బంధువులకు దగ్గర చేయాలని, సొంత వాళ్లతో కలసి బతకాలని నిర్ణయించుకుని సొంతూరుకు తిరిగి వచ్చానని లక్ష్మన్న చెబుతున్నాడు.