
పట్టపగలే మహిళ దారుణ హత్య
● ఒంటిపై ఉన్న బంగారు గొలుసు,
గాజులు, నగదు దోపిడీ
కర్నూలు: కర్నూలు శివారులోని గణేష్ నగర్ పక్కనున్న (కల్లూరు అర్బన్ 19వ వార్డు) సాయి వైభవ నగర్‌లో నివాసముంటున్న శివలీల(75) దారుణ హత్యకు గురయ్యారు. ఈమె భర్త కాటసాని సాంబ శివారెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించాడు. వీరికి కూతురు ఉమామహేశ్వరమ్మ, కొడుకు గంగాధర్ రెడ్డి సంతానం. కుమారుడు అమెరికాలో డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డాడు. కూతురు ఉమామహేశ్వరమ్మ కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. ఈమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి రిటైర్డ్ ఏసీటీఓ. వీరు వెంకటరమణ కాలనీలో నివాసముంటున్నారు. అయితే కూతురు ఉమామహేశ్వరమ్మ ప్రతిరోజూ తల్లి ఇంటికి వచ్చి చూసుకుని వెళ్లేది. సోమవారం ఉదయం కూడా తల్లి ఇంటి వద్ద నుంచే కళాశాలకు వెళ్లింది. ఇంట్లో వంట రూంలో ఒంటరిగా ఉన్న శివలీలపై మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు పదునైన కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండగా దుండగులు ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులతో పాటు బీరువాలో ఉన్న కొంత నగదును మూటకట్టుకుని ఉడాయించారు. అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి మధ్యాహ్నం ఇంటి వద్దకు వెళ్లిచూడగా ఆమె రక్తపు మడుగులో పడివుండగా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు కారణాలపై కూతురు, అల్లుడుతో మాట్లాడారు. అయితే పనిమనిషి వరలక్ష్మి రెండు రోజుల క్రితం పని మానేసిందని, ఆమైపెనే అనుమానం ఉన్నట్లు పోలీసుల దృష్టికి తెచ్చారు. మృతురాలు శివలీల ఫోన్ కాల్ డేటా, పనిమనిషి వరలక్ష్మి ఎవరెవరితో మాట్లాడిందన్న కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.