
శివయ్యా.. నీవే దిక్కు!
పెద్దసత్రంలో నివాసగృహాలు
పెద్దసత్రంలో నిరసన తెలుపుతున్న మహిళలు
శ్రీశైలంటెంపుల్: మల్లన్న చెంత నివాసముంటున్న దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులకు గూడు కరువై రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దేవస్థానం పరిధిలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా భవనాల తొలగింపునకు దేవస్థానం చర్యలు చేపట్టింది. దీంతో అందులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా పంపిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం శ్రీశైల ఆలయ సిబ్బంది వసతి గృహాల కోసం దేవస్థానం పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. ఈ మూడింటిలో 223 నివాసాలు ఉన్నాయి. కాలక్రమేణ దేవస్థాన అధికారులు, సిబ్బందికి మరొక గృహ సముదాయాలను నిర్మించడం, ఆయా వసతి గృహాలకు ఉద్యోగులు తరలివెళ్లారు. దీంతో పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు నివాసం ఉంటున్నారు. అయితే ఆయా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని నివాసితులు అడపాదడపా మరమ్మతులు చేయించుకుని అలాగే నివసిస్తున్నారు. ఈ భవనాల నిర్ధిష్ట ఆయుర్థాయ కాలపరిమితి (బిల్డింగ్ లైఫ్ స్పాన్) ముగింపు దశకు చేరుకుందని రహదారులు–భవనాలు (ఆర్‌అండ్‌బీ), పంచాయతీరాజ్ శాఖల సాంకేతిక నిపుణులు పరిశీలించి, దేవస్థానానికి నివేదిక సమర్పించారు. నివాసితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి, భవనాలను తొలగించాలని దేవస్థానం నిర్ణయించింది.
నివాసితులకు నోటీసులు..
పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో నివసిస్తున్న దేవస్థాన ఉద్యోగులకు, ఇతర నివాసితులకు దేవస్థానం నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు అందిన ఒక నెలలో వారి నివాసాలను ఖాళీ చేయాలని లిఖితపూర్వకమైన నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయమై నివాసితులందరు కూడా దేవస్థానానికి సహకరించాలని తెలియజేస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పెద్దసత్రం నివాసితులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు, ముగ్గురికి నోటీసులు ఇచ్చిన అధికారులు నిరసనతో వెనుదిరిగి వెళ్లారు.
పెద్దసత్రం, శివసదనం, పోన్నూరు సత్రంలో గృహాలు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నిర్మించినవి. తక్షణమే ఖాళీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆయా గృహ సముదాయంలో ఉన్న దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపేందుకు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీ వేశాం. వారిని ఖాళీ చేస్తే వారికి మంచిగా ఏమి చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఆయా గృహా సముదాయాల్లో ప్రైవేట్ వ్యక్తులు సైతం ఉన్నారు. అందరికి నోటీసులు ఇచ్చి, అందరిని ఖాళీ చేయిస్తాం.
– ఎం.శ్రీనివాసరావు,
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
శ్రీశైలంలో శిథిలావస్థకు చేరిన
పలు గృహా సముదాయాలు
పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు
సత్రాల్లో సుమారు 223 గృహాలు
గృహాలను ఖాళీ చేయాలని
సూచించిన సాంకేతిక నిపుణులు
నివాసితులకు దేవస్థానం నోటీసులు
ప్రత్యామ్నాయం చూపాలంటున్న
బాధితులు

శివయ్యా.. నీవే దిక్కు!

శివయ్యా.. నీవే దిక్కు!

శివయ్యా.. నీవే దిక్కు!