
చుక్కలతో రాజన్న చిత్రం
నంద్యాల(అర్బన్): పట్టణ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చుక్కలతో రాజన్న చిత్రాన్ని గీచారు. మైక్రో పెన్నుతో డ్రాయింగ్ చార్ట్‌పై చుక్కలు పెట్టుకుంటూ వైఎస్సార్ కొట్రాయిట్ చిత్రాన్ని వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. మహానేత అనేక సంక్షేమ పథకాల చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. శరణు కోరిన వారికి కరుణ చూపించే మంచి వ్యక్తిగా, ఎప్పుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఆప్యాయంగా పలకరించే దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొలువై ఉన్నారంటూ చిత్ర నివాళులు అర్పించారు.
అక్కను చూసేందుకు వచ్చి.. ఫిట్స్‌తో కాల్వలో పడి వ్యక్తి మృతి
మహానంది: మహానందిలో గత కొంత కాలం నుంచి యాచిస్తూ జీవనం సాగిస్తున్న తన అక్కను చూసేందుకు వచ్చిన తమ్ముడు మూర్ఛకు గురై కాల్వలో పడి మృతి చెందిన విషాద ఘటన సోమవారం మహానందిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...బనగానపల్లె మండలం ఇల్లూరి కొత్తపేట గ్రామానికి చెందిన సుంకన్న(50) అక్క సుబ్బలక్ష్మమ్మ గత కొద్ది నెలలుగా మహానందిలో ఉంటుంది. విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు ఇక్కడికి వచ్చాడు. కరివేన సత్రం సమీపంలో ఉన్న కోనేరు నీరు బయటికి వచ్చే కాల్వ వద్ద కూర్చుని ఉండగా మూర్ఛకు గురై కాల్వలో పడిపోయాడు. ఎవరూ గుర్తించకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు మహానందికి చేరుకుని సుంకన్న మృతదేహాన్ని ఆటోలో తరలించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నందికొట్కూరు: కొనేటమ్మపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాటం సుధాకర్ (60) అనే వ్యక్తి 2020 నుంచి దాదాపు ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత ఐదేళ్లుగా పంటల సాగు కోసం బ్యాంకు, తెలిసిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తుల వద్ద దాదాపు రూ.15 లక్షల మేర అప్పులు చేసినట్లు తెలిపారు. అయితే ఐదేళ్లుగా వరుసగా నష్టాలు రావడంతో అప్పులు పెరిగి పోయాయి. అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన సుధాకర్ శనివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్య నీలమ్మ గుర్తించి వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం మధ్యాహ్నం కోలుకోలేక మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు తెలిపారు.