
రూ. 50 కోట్లతో పాణ్యం రైల్వేస్టేషన్
పాణ్యం: పాత దాన్ని తొలగించి రూ. 50కోట్ల పైగా నిధులతో నూతనంగా పాణ్యం రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. సోమవారం ప్రత్యేక రైలులో సీఆర్‌ఎస్ మాధవి ఇక్కడికి వచ్చి నూతన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. స్టేషన్‌లో ఉన్న సిగ్నల్ సిస్టిమ్, స్టేషన్ విస్తీర్ణం, నూతంగా చేపట్టిన పనులు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఇది వరకే పాణ్యం– బేతంచెర్ల వరకు డబుల్ ట్రాక్ పనులు పూర్తి చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న పాణ్యం–నంద్యాల మధ్య పనులు పూర్తి కావడంతో ప్రత్యేక ట్రాలీలో సీఆర్‌ఎస్ మాధవి పరిశీలించి, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పాణ్యం రైల్వే స్టేషన్‌లో ఔరంగబాద్–గుంటూరు రైలును ఆగేలా చూడాలని సీఆర్‌ఎస్ మాధవికి ప్రజలు వినతి పత్రం అందించారు. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. గుంటూరు డీఆర్‌ఎం సుదేష్ణషేన్, గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, రైల్వే టెక్నికల్ ఇంజినీర్లు, రైల్వే ఇంజనీర్లు అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభించిన
సీఆర్‌ఎస్ మాధవి
నంద్యాల–పాణ్యం మధ్య
డబుల్ ట్రాక్‌కు
గ్రీన్ సిగ్నల్