
గుంతలు వెక్కిరిస్తున్నాయ్!
కోసిగి: కూటమి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి గుంతలో దిగబడిన ఈ ఆటో అద్దం పడుతోంది. యూరియా కొరత ఇప్పటికే తీవ్రరూపం దాల్చగా.. ఓ బస్తాను దక్కించుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి సమయంలో అతి కష్టం మీద కొనుగోలుచేసి ఎరువులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడటంతో రైతులు చుక్కలు చూడాల్సి వచ్చింది. కౌతాళం మండలంలోని చూడి గ్రామం కోసిగి మండలానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఇరువులు దొరక్కపోవడంతో కోసిగిలోని ప్రయివేట్ డీలర్ వద్ద కొనుగోలు చేసేందుకు వచ్చారు. నలుగురు రైతులు 20 బస్తాలు కొనుగోలు చేశారు. అయితే కోసిగి మండల కేంద్రంలోని ఉరుకుంద ఆర్చ్ సమీపంలో చాప వాగు వద్ద రోడ్డు కోతకు గురైంది. గుంతలమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎరువుల బస్తాలతో వెళ్తున్న ఆటో ఓ గుంతలో ఇరుక్కుపోయింది. ఘటనలో కొన్ని బస్తాలు కిందపడిపోగా రైతులు బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇదేసమయంలో అమావాస్య కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు సైతం ఈ గుంతల రహదారిలో అవస్థలు పడ్డారు.