
ట్రాక్టర్ ఢీకొని విద్యార్థికి తీవ్రగాయాలు
జూపాడుబంగ్లా: ట్రాక్టర్ ఢీకొని ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జూపాడుబంగ్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరిగోపుల గ్రామానికి చెందిన భూశయ్య, సావిత్రి దంపతుల రెండో కుమారుడు జనార్దన్ జూపాడుబంగ్లా మోడల్‌స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పాఠశాల వదలడంతో నడుచుకుంటూ బస్టాండు వైపు వస్తున్నాడు. అదే సమయంలో కూలీలను ఎక్కించుకొని పాములపాడుకు వెళ్తున్న ఏపీ21టీఏ 0923, ఏపీ21టీఏ0924 రెండు నెంబర్లు కలిగిన ట్రాక్టర్‌ను డ్రైవర్ అతివేగంగా నడుపుకొంటూ వచ్చి రోడ్డుపక్కన వెళ్తున్న విద్యార్థిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో విద్యార్థి తలకు బలమైన గాయం కావటంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ట్రాక్టర్‌ను నిలువరించటంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ షేక్షావలి పోలీసు జీపులో గాయపడిన జనార్దన్‌ను నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు 108లో తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని గాయపడిన కొడుకును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ రమే ష్, పాఠశాల సిబ్బంది, నంద్యాల, కర్నూలు డీఈఓలు జనార్దన్, శ్యామ్యూల్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.