
చెట్టు కింద జీవన వెలుగు
‘ఆస్తులు లేవు.. బంధువులు లేరు.. హోదా లేదు.. తోడా నీడా కరువైంది’ అని సమాజంలో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఇవేమీ లేకున్నా కొంతమంది పది మందికి సాయం అందిస్తూ జీవనాన్ని వెలిగిస్తున్నారు. మంత్రాలయానికి చెందిన బెస్త పద్మమ్మను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈమెకు 30 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలూకా పరిధిలోని వీరాపురం గ్రామానికి నాగేంద్రప్పతో వివాహమైంది. అనారోగ్యంతో భర్త తనువు చాలించడంతో ఆమె ఒంటిరి మహిళగా కూలి పనులు చేసుకుంటూ మంత్రాలయంలో జీవనం సాగిస్తున్నారు. ఆమె దుస్థితి చూసి 24 ఏళ్ల క్రితం రాఘవేంద్రపురంలో ప్రభుత్వం నివాస స్థలం ఇవ్వగా కొందరి వికృత చేష్టలతో ఆమె అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం మంత్రాలయంలోని కర్ణాటక అతిథిగృహం కాంపాండ్ చాటున చెట్టు కింద జీవనం సాగిస్తున్నారు. వానొస్తే తల దాచుకోవడానికి ఆమెకు స్థలం లేదు. గోడను ఆసరాగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తనకు అండగా ఎవరూ లేకున్నా పది మంది సాయం చేస్తున్నారు. – మంత్రాలయం