
‘టెన్’కాయ దోపిడీ రూ. కోటిపైనే !
ఉరుకుందలో అడ్డూఅదుపులేని టెంకాయ మేటీల దందా
ఒక్కో టెంకాయ కొట్టుడుకు భక్తుల నుంచి రూ.10 వసూలు
శ్రావణమాసం దోపిడే రూ.కోటి పైమాటే
చోద్యం చూస్తున్న ఆలయాధికారులు
దోపిడీకి అక్కడ అవధుల్లేవు. అభ్యంతరాలు అంతకన్నా లేవు. భక్తులను నిలువునా దోచుకోవడమే పరమావధి. కాంట్రాక్టర్లు మొదలు మేటీల వరకు ఇదే పంథా. టెంకాయ దక్షిణ మాటున సాగుతున్న ఓ భారీ దందా ఇది. ఒక్క టెంకాయ కొట్టుడు దోపిడీనే రూ.కోటి పైమాట. ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో సాగుతున్న దందాలకు భక్తులు తలలు పట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడు.
మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామ సమీపంలో ఈరన్నస్వామి వెలిశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్వామి భక్తులు ఉన్నారు. ఉరుకుంద క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాలు ప్రత్యేకం. నెలరోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాసంలో దాదాపు 4–5 లక్షల భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. భక్తులు స్వామి వారికి జోడు టెంకాయలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది 5 లక్షలకుపైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించినట్లు అధికారిక లెక్క.
రూ.కోటి కొట్టేశారు
ఈరన్న స్వామి క్షేత్రం పరిధిలో తొలి నుంచి మూడు మేటీల కుటుంబాలు టెంకాయలు కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణమాస ఉత్సవాల్లో ఇక్కడ దాదాపు 10 లక్షల టెంకాయలు భక్తులు సమర్పిస్తారు. ఒక టెంకాయ కొట్టడానికి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. భక్తులు మొండికేసినా ముక్కుపిండి వసూలు చేయడం పరిపాటి. ఈ లెక్కన 10 లక్షల టెంకాయలు కొడితే వారికి వచ్చే ఆదాయం రూ.కోటి. చూడటానికి చిన్నగానే కనిపిస్తోంది. అయితే, లెక్క తేల్చితే అక్షరాల రూ.కోటి. కాగా శ్రావణ మాసం మినహా క్షేత్రానికి ప్రతి అమావాస్య రోజున వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. అమావాస్య రోజున కనీసం 20 వేల టెంకాయలకు మించి భక్తులు సమర్పిస్తారు. పన్నెండు అమావాస్యలకుగానూ రూ.24 లక్షలు వస్తోంది. ఇక సోమ, గురువారాలు సైతం క్షేత్రంలో రద్దీ ఉంటుంది. ఇలా ఏడాదికి టెంకాయ కొట్టుడు రూపంలో దక్షిణ సంపాదన దాదాపు రూ.1.50 కోట్లు పైగానే. ఈసారి ఆలయ శ్రావణ మాసం హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చింది. హుండీ ఆదాయంలో పావు వంతుతో సమానంగా కొట్టుడు దోపిడీ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం.
అధికారుల కళ్లేదుటే ఈ దందా
భక్తుల సెంటిమెంట్ ముసుగులో దక్షిణ ఓ భాగం.ఆ సెంటిమెంట్ ఆసరాగా చేసుకొని రూ.కో ట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఇదంతా ఆలయంలోనే అధికారుల కళ్లెదుటే సాగుతోంది. భక్తులు అక్కడే దక్షిణ ఇచ్చుకోలేమని మొత్తుకుంటున్నా అటు వైపు చూడరు. మేటీల దక్షిణకు అక్కడ ఓ పద్ధతి అంటూ లేదు. ఇంత దక్షిణ తీసుకోవాల న్న నియమం లేదు. ప్రైవేటు మేటీలు టెంకాయ లు కొట్టేందుకు ఆలయంలోనే ప్రత్యేక కట్టను నిర్మించారు. ఏ క్షేత్రంలోనూ ఈ సంస్కృతి కనిపించదు. అయినా మేటీల వసూళ్లకు నిబంధనలు పెట్టకపోవడంపై భక్తులు విస్తుపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు దక్షిణ దందాకు స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

‘టెన్’కాయ దోపిడీ రూ. కోటిపైనే !