
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఆదోని రూరల్: మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో యూరియా కోసం రైతు లు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెద్దహరివాణం రైతు సేవాకేంద్రం వద్ద, ఆదోని–సిరుగుప్ప రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్కడ యూరియా కొరత లేదని రైతులందరికీ అందిస్తున్నామని కల్లిబుల్లి మాటలు చెబుతోందన్నారు. రైతులకు సరిపడా యూరియా మాత్రం అందించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం నాలుగు రైళ్లలో యూరియా తెప్పిస్తామని మాటలు చెప్పి నెలరోజులయ్యిందని, కానీ రైతులకు సరిపడేంత యూరియా మాత్రం అందించలేకపోయారన్నారు. తక్షణమే రైతులకు సరిపడినంత యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు లక్ష్మన్న, రైతుసంఘం మండల నాయకులు అబ్బాస్, పెద్దహరివాణం గ్రామ రైతులు పాల్గొన్నారు.