
విరిగిపడిన బస్సు చక్రం
ఆత్మకూరు: పట్టణ సమీపంలోని కె.జి.రోడ్డులో కర్నూలు నుంచి ఆత్మకూరుకు వస్తున్న ఆర్టీసీ హైర్ బస్సు (ఏపీ 39 యూకే 2407)కు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు కె.జి.రోడ్డులో వస్తుండగా ముందు టైర్ అకస్మాత్తుగా పగిలింది. దీంతో యాక్సిల్ నుంచి ఊడిపోయి దొర్లుతూ ముందుకు వెళ్లి పడింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. బస్సులో 16 మంది ప్రయాణికులు ఆత్మకూరు బస్టాండుకు చేరుకోవాల్సి ఉంది. బస్సు నెమ్మదిగా వస్తుండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వేగం ఎక్కువైతే డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీ కొట్టే ప్రమాదం ఉండేది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ డీఎం వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఘటనా స్థలాన్ని సందర్శించానని, తమ పరిధిలో బస్సులు కండీషన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైర్ బస్సు ఓనర్‌తో మాట్లాడామని, బస్సులు కండీషన్ లేకపోతే రద్దు చేస్తామన్నారు.
‘సీ్త్ర శక్తి’కి అదనంగా బస్సులు కేటాయించాలి
కర్నూలు సిటీ: ‘సీ్త్ర శక్తి’ పథకానికి అదనంగా బస్సులు కేటాయించాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ, అలివేలు, ఉపాధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో వారు మాట్లాడారు. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం అవేవీ లేకుండానే హడావుడిగా మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేశారన్నారు. ఆదోని నుంచి ఆత్మకూరుకు ప్రయాణం చేయాలంటే రెండు బస్సులు మారాలని, ఇలా ప్రయాణించాలంటే అదనపు సమయం పడుతుందన్నారు. తిరుపతి, అన్నవరం, విజయవాడ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని కూటమి నేతలు ప్రచారం చేశారని, కానీ ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తగినన్నీ బస్సులు లేకపోవడంతో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య మహిళలు అవస్థలు పడుతూ నుంచొని ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు.