
ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి
మహానంది: ఆలయాల భూముల అన్యాక్రాంతం అంశంపై డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ ఆదేశించారు. మహానందిలోని టీటీడీ కల్యాణ మండపంలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని దేవస్థానాల నిర్వాహకులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆర్‌జేసీ మాట్లాడుతూ.. బాధ్యతాయుతంగా పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించే వారికి మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
దేవుళ్లకు ఆధార్ ఉంటుందా?
ఆలయ భూముల అన్యాక్రాంతం విషయంపై ఆర్‌జేసీ ఆజాద్ ఓ ఈఓను వివరాలు కోరగా రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తే ఆధార్ కార్డులు అడుగుతున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లకు ఆధార్ కార్డు ఉంటుందా అని ప్రశ్నించారు. మిగతా దేవస్థానాలకు చెందిన భూముల విషయంలో వర్తించని నిబంధనలు మీకే ఎలా వర్తిస్తుందన్నారు. వివిధ జిల్లాల్లో ఉన్న దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లు, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్లు తరచూ వెళ్తూ పరిశీలించాలని కోరారు. ఆలయాల స్థల పురాణాలపై ఈవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రధాన ముఖ ద్వారాల వద్ద భక్తులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
సాధారణ భక్తుడిలా వెళ్లి పరిశీలన
ఆర్‌జేసీ చంద్రశేఖర ఆజాద్ ముందుగా మహానందీశ్వర స్వామి దర్శనానికి ఓ సాధారణ భక్తుడిలా వెళ్లారు. అక్కడక్కడ లోపాలు ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత దర్శనం బోర్డు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టికెట్లు తీసుకోవాలని చెప్పే సిబ్బంది ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఉండడంపై మండిపడ్డారు. సమావేశంలో మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, జిల్లా డీసీ గురుప్రసాద్, మద్దిలేటి స్వామి ఆలయ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.