జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గంజాయి, కొకైన్ సహా అన్ని రకాల మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. యూనివర్సిటీలు, కాలేజీల్లో మత్తు పదార్థాల వినియోగంపై వర్కుషాపులు, ర్యాలీలు తదితర అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లలో మాదక ద్రవ్యాల నివారణకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయా ఆర్‌డీఓలను అడిగి తెలుసుకున్నారు. మత్తు బానిసలకు రీహ్యాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు డీఎంహెచ్‌ఓను డాక్టర్ శాంతికళను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని శాఖల అధికారులు పోలీసులకు సహకరించాలన్నారు. కర్నూలు నగరంలో కేసీ కెనాల్, బస్టాండ్, రైల్వే స్టేషన్, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, ఫ్లైఓవర్ల కింద మత్తు పదార్థాలను సేవించే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలనకు సంబంధించి ముద్రించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, డీటీసీ శాంతకుమారి, ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలి